ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచిన...ఒక విశాఖపట్నం సిటీలో మాత్రం టీడీపీ హవా నడిచిన విషయం తెలిసిందే. నగరంలో ఉన్న నాలుగు సీట్లని టీడీపీనే గెలుచుకుంది. ఇక విశాఖపట్నం ఎంపీ స్థానాన్ని కూడా స్వల్ప మెజారిటీ తేడాతో కోల్పోయింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయిన రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ హవా నడవాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. నగరంలో బలం ఉన్న టీడీపీకి చెక్ పెట్టేందుకు పలు వ్యూహాలు రచిస్తూ ముందుకెళుతున్నారు.


ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ నాలుగు నియోజకవర్గాలు విశాఖ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ లలో బలంగానే ఉంది. ఇక్కడ నగర ఓటర్లు ఎక్కువగా టీడీపీకే మద్ధతు తెలుపుతారు. కాబట్టి ఇక్కడ టీడీపీకి చెక్ పెట్టడం అంత సులువైన పని కాదు. కానీ పార్టీ అధికారంలో ఉండటం కలిసొచ్చే అంశం. పైగా వైసీపీలో నెంబర్2గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పటి నుంచో ఇక్కడ పాగా వేసి ఉన్నారు.


ఇప్పటికే విశాఖ మున్సిపాలిటీలో పార్టీని గెలిపించే బాధ్యతను భుజానికి ఎత్తుకున్న విజయసాయిరెడ్డి అక్కడే మకాం వేసి వ్యూహరచన చేస్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయసాయిరెడ్డి విశాఖలో అత్యధిక సీట్లు గెలవడానికి బాగానే కృషి చేశారు. నాయకులని సమన్వయం చేసుకుంటూ...సమిష్టిగా కలిసి పని చేసి 15 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాలని గెలిపించుకున్నారు. అటు మూడు పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ జెండా ఎగిరేలా చేశారు.


ఇక ఇప్పుడు కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత విజయసాయి తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరుపున విశాఖపై వరాల జల్లు కూడా కురిపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖ నగర ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపడం పెద్ద కష్టమేమీ కాదు. మొత్తానికి ఇక్కడ టీడీపీకి సులువుగా చెక్ పెట్టి వైసీపీ విజయం సాధించవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: