వ్యూహాత్మకమైన పాలన చేయడం జగన్ కు అలవాటు అయిపోయినట్లు కనిపిస్తోంది. ఒకవైపు మంచి నిర్ణయాలు, ప్రజలకు మేలు చేసే పథకాలు అందిస్తున్నా..కొన్ని నిర్ణయాల అమలులో ప్రభుత్వంపై విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఆ విమర్శలకు వెంటనే చెక్ పెట్టడంలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ సి‌ఎస్ బదిలీలో కూడా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు అర్ధమవుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల జగన్....సి‌ఎస్ గా ఉన్న ఎల్‌వి సుబ్రహ్మణ్యంని హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.


అలాగే ఇన్‌చార్జ్‌ సీఎస్‌గా నీరబ్‌ కుమార్‌ ప్రసాద్ కొనసాగేలా ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు రాజకీయం చేశాయి. ఎల్‌విని బదిలీ చేయడం దుర్మార్గం అంటూ...టీడీపీ, బీజేపీలు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. అయితే ప్రతిపక్షాలు సంగతి పక్కనబడితే రాష్ట్రంలోని బ్రాహ్మణ సామాజికవర్గం ఎల్‌వి బదిలీని తప్పుబట్టాయి. అలాగే దీనిపై విశాఖ జిల్లాకు చెందిన అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ప్రభుత్వ నిర్ణయంపై తన సామాజిక వర్గం తీవ్ర ఆవేదనకు గురైందని ఆయన సీఎం దృష్టికి తెచ్చారు.


ఇక విషయం అర్ధం చేసుకున్న జగన్ వెంటనే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వం రమణదీక్షితులను శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడి బాధ్యతలని నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఇక జగన్ ఇప్పుడు అదే రమణ దీక్షితులకు ప్రధాన అర్చకుడిగా నియమించేందుకు న్యాయపరమైన చిక్కులు ఉండటంతో, తక్షణ ఉపశమనంగా ఆయన్ను టీటీడీ ఆగమ సలహాదారుగా నియమించారు. దీంతో పాటు గత ప్రభుత్వం తప్పించిన ఆయన ఇద్దరు కుమారులను తిరిగి శ్రీవారి ఆలయంలో బాధ్యతలు అప్పగించారు. దీంతో రమణ దీక్షితులతో పాటు బ్రాహ్మణ వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమవుతోంది.


అటు టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ ను ఢిల్లీలోని ఏపీ భవన్ కు మార్చే ఉద్దేశంలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక ఆయన స్ధానంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికే చెందిన జేఎస్వీ ప్రసాద్‌ను ఈవోగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ బ్రాహ్మణ సామాజికవర్గంలో అసంతృప్తి రాకుండా చూసుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: