ఇసుక మాఫియా చాలా పెద్దది.. గతంలో చంద్రబాబు సర్కారు పడిపోవడానికి కారణమైన వాటిలో ఈ ఇసుక కూడా ఒకటి. నిర్మాణ రంగం జోరుగా ఉన్న ఈరోజుల్లో ఇసుక బంగారంలా మారిపోయింది. అందుకే.. ఇప్పుడు ఇసుక కోసం ఇంత రాజకీయం జరుగుతోంది. అందుకే విపక్షాల రగడ ఇంకాస్త ముదరకుండా ఉండేందుకు జగన్ చర్యలు చేపట్టారు.


ఇసుక మాఫియా, స్మగ్లింగ్‌ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇసుక విధానంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇసుక ధరలకు కళ్లెం వేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇసుక ధర నియంత్రణకు ఏకంగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు.


ఈలోగా ఆర్డినెన్స్‌ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిల్లాలు, నియోజకవర్గాల వారిగా ధలను నిర్ణయించాలని కలెక్టర్లు, గనుల శాఖ అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా ఎక్కువ ధరలకు ఇసుక అమ్మితే ఏకంగా జైలుకు పంపించేలా చట్టం రూపొందించాలని జగన్ అధికారులను ఆదేశించారు.


అంతే కాదు.. ఇసుక సరఫరాల్లో ఏమైనా సమస్యలు వస్తే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. ఆ నెంబర్ నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును విచారంచాలని సూచించారు. వచ్చే స్పందన కార్యక్రమం పూర్తిగా ఇసుక సమస్యకు కేటాయించాల్సిందిగా కూడా జగన్ అధికారులను ఆదేశించారు.


ఇసుక రీచుల వద్ద సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని.. ప్రతి విషయం పారదర్శకంగా ఉండాలని జగన్ ఆదేశిస్తున్నారు. వరదల కారణంగా ఇసుక కొరత ఉన్నా..క్రమంగా సరఫరా మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు జగన్ కు వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: