పోలీసులు అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సురేశ్ విజయారెడ్డి భర్త సుభాష్ రెడ్డిని ఒక మధ్యవర్తి సహాయంతో హత్యకు రెండు రోజుల ముందు కలిసినట్లు తెలుస్తోంది. నిందితుడు సురేశ్ సుభాష్ రెడ్డితో ఏం మాట్లాడాడు...? సురేశ్ సుభాష్ ను ఎందుకు కలిశాడు..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. 
 
పోలీసులు ఇప్పటికే సుభాష్ రెడ్డిని ఈ విషయం గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సురేశ్ విజయారెడ్డి హత్యకు రెండు రోజుల ముందు భూవివాదం విషయంలో తహశీల్దార్ విజయారెడ్డితో తాడోపేడో తేల్చుకుంటానని సన్నిహితులతో చెప్పాడని సమాచారం. తహశీల్దార్ కార్యాలయంలో విజయారెడ్డికి నిప్పంటించిన తరువాత కాలిన గాయాలతో బయటకు వచ్చిన సురేశ్ ఒక వైన్ షాపు ముందు ఉన్న కారులోని వ్యక్తులతో మాట్లాడాడు. 
 
ఆ కారులోని వ్యక్తులు ఎవరు...? సురేశ్ వారితో ఏం మాట్లాడాడు..? విజయారెడ్డి హత్య కేసుకు ఆ కారులోని వ్యక్తులకు ఏమైనా సంబంధం ఉందా...? అనే విషయాలు తెలియాల్సి ఉంది. సురేశ్ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు సురేశ్ కు సన్నిహితుడైన నరసింహ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలో గౌరెల్లి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించిన సమయంలో సురేశ్ విజయారెడ్డితో గొడవ పడ్డాడని తెలుస్తోంది. 
 
తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేశ్ విజయారెడ్డితో గతంలో గొడవ పడినట్లు వీడియో ఆధారాలు కూడా పోలీసులకు లభించినట్లు తెలుస్తోంది. కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో నిందితుడు సురేశ్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అని ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సురేశ్  మంచిరెడ్డి కిషన్ రెడ్డి కోసం పని చేశాడని గౌరెల్లి గ్రామస్థులు చెబుతున్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సురేశ్ కు టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం లేదని స్పష్టం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: