దాదాపు 33 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ఓవైపు ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేస్తుండ‌గా...మ‌రోవైపు కార్మికుల్లో సైతం విబేధాల‌కు కార‌ణ‌మ‌వుతోందా?  మెజార్టీ స‌మ్మెపై ముందుకు సాగుతుంటే...కొంద‌రు స‌మ్మెకు నో చెప్ప‌డంతో ఈ స‌మ‌స్య త‌లెత్తుతోందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కొంద‌రు కార్మికుల‌కు ఆర్థిక అవ‌స‌రాలు ఉండ‌టం, పూటగడిచే పరిస్థితి లేకపోవడం వ‌ల్ల ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో విధుల్లో చేరేందుకు ముందుకు వ‌స్తున్నారు. అయితే, ధైర్యం చేసి విధులకు హాజరయ్యేందుకు వచ్చినవారిపై ప‌లుచోట్ల‌ దాడులు జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు సంచ‌ల‌నంగా మారుతోంది.


పెద్దపల్లి జిల్లాలోని రామగుండానికి చెందిన మెకానిక్ అలీబాబా గోదావరిఖని డిపోలో మంగళవారం విధుల్లో చేరారు. అయితే, యూనియన్ నాయకులు బుధవారం అలీబాబా ఫ్లెక్సీకి చెప్పుల దండవేసి నిర‌స‌న తెలిపారు. కాగా, ఆర్టీసీ జేఏసీ నాయకులు చ‌ర్య‌ల నేప‌థ్యంలో...పోలీస్‌శాఖ అప్రమత్తమై డిపోల వద్ద భద్రత పెంచింది. విధుల్లో చేరిన కార్మికులకు భద్రత కల్పిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై, అమాయకులపై దాడులకు దిగేవారిపై కఠినచర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


మ‌రోవైపు తాత్కాలిక కార్మికుల విష‌యంలోనూ...ఆర్టీసీ జేఏసీ నేతలు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో బుధవారం ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆర్టీసీ కార్మికులు బస్టాండ్‌వైపు ర్యాలీగా వచ్చి డిపోవైపు వెళ్లేందుకు యత్నించారు. అదే సమయంలో డిపో నుంచి బయటకు వస్తున్న ఇద్దరు తాత్కాలిక డ్రైవర్లు, మహిళా కండక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. మేం సమ్మెలో ఉంటే, మీరెందుకు విధులకు వస్తున్నారని ప్రశ్నించారు. మాకు జీతాల్లేవు.. మా మనుగడ కష్టంగా ఉందంటూ ఆందోళ‌న చేశారు. 
ఇదిలాఉండ‌గా, ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఏమీలేవని, పైగా ప్రభుత్వానికే ఆర్టీసీ రూ.540 కోట్లు బకాయి పడి ఉన్నదని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హైకోర్టుకు తెలిపారు. దీంతో ఆర్టీసీపై ప్ర‌భుత్వ వైఖ‌రి చర్చ‌నీయాంశంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: