నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు షాక్ ఇచ్చింది. కేంద్ర కార్మిక శాఖ కార్మికుల పని గంటలలో మార్పులు చేయనున్నట్లు ముసాయిదా బిల్లులో ప్రతిపాదనలు చేసింది. తొమ్మిది గంటల సమయం పాటు సాధారణ పని దినాలలో పని చేయాలని ముసాయిదా బిల్లులో పేర్కొంది. ప్రస్తుతం ఈ బిల్లు గురించి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. పనిగంటల మార్పు గురించి ప్రతిపాదనలు చేసిన కేంద్ర కార్మిక శాఖ జాతీయ కనీస వేతనం నిర్ణయాన్ని అమలు చేయటానికి మాత్రం ఆసక్తి చూపలేదు. 
 
కేంద్ర కార్మిక శాఖ కార్మికుల కనీస వేతనాల విషయంలో మాత్రం నిర్ణయాన్ని నిపుణుల కమిటీకే వదిలేసింది. కేంద్ర కార్మిక శాఖలోని అంతర్గత వ్యవహారాల కమిటీ జాతీయ కనీస వేతన చట్టం ప్రకారం కార్మికులకు 2018 సంవత్సరం జులై నెల నుండి రోజుకు 375 రూపాయల చొప్పున చెల్లించాలని నివేదిక ఇచ్చింది. ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ నెలకు 9,750 రూపాయలు చెల్లించాలని సిఫార్సు చేసింది. 
 
ఈ కమిటీ 1,430 రూపాయలు హెచ్‌ఆర్ఏ నగరాల్లో పని చేసే కార్మికులకు అదనంగా అందజేయాలని సూచనలు ఇచ్చింది. ఈ సంవత్సరం డిసెంబర్ నెల నాటికి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తవుతుంది. ఆ తరువాత నిపుణుల కమిటీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కమిటీ ముసాయిదా బిల్లులో గ్రామీణ ప్రాంతాలు, నాన్ మెట్రో పాలిటన్ ప్రాంతాలు, మెట్రో పాలిటన్ ప్రాంతాలుగా విభజించి నిబంధనలు రూపొందించింది. 
 
ఈ బిల్లులో 10 లక్షల జనాభా కంటే తక్కువ జనాభా ఉంటే గ్రామీణ ప్రాంతాలుగా 10 లక్షల జనాభా నుండి 40 లక్షల జనాభా ఉంటే నాన్ మెట్రోపాలిటన్ నగరాలుగా 40 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉంటే మెట్రో పాలిటన్ నగరాలుగా కమిటీ ముసాయిదా బిల్లులో పేర్కొంది. ప్రస్తుతం కనీస హెచ్‌ఆర్ఏ 10 శాతంగా ఉంది. నగరాల్లో నివశించే కార్మికులకు హెచ్‌ఆర్ఏ మారుతుందా...? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: