అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు స‌ర్వ‌త్రా ఆస‌క్తిని, ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. వివాదాస్పద స్థలం ఉన్న అయోధ్య నగరం మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నది. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా తమకు సమ్మతమేనని స్థానిక హిందువులు, ముస్లింలు స్పష్టం చేస్తున్నారు. మందరిమైనా.. మసీదు అయినా ఫర్వాలేదని తమకు శాంతి మాత్రమే ముఖ్యమని వారు చెప్తున్నారు. ‘మాకు ఎలాంటి ఉత్కంఠ లేదు. తీర్పు ఎలా వచ్చినా స్థానికులకు ఇబ్బందేం లేదు. కొందరు స్థానికేతరులు మాత్రం గొడవ చేసే అవకాశం ఉంది’ అని ఓ వ్యాపారి పేర్కొన్నారు.


ఇదే స‌మ‌యంలో ఓ ముస్లిం మ‌త‌పెద్ద కీల‌క ప్ర‌క‌ట‌న సుప్రీంకోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉన్నా తమకు సమ్మతమేనని స్ప‌ష్టంచేశారు. ఆయ‌నే....ప్రముఖ ఇస్లామిక్‌ సంస్థ జమాత్‌ ఉలేమా ఏ హింద్‌ సంస్థ అధినేత మౌలానా సయీద్‌ అర్షద్‌ మదాని. ముస్లింలంతా కోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.తుది తీర్పు వచ్చేవరకు వివాదాస్పద కట్టడం షరియా చట్టం ప్రకారం మసీదుగానే ఉంటుందని చెప్పారు. ఎలాంటి ప్రార్థనా మందిరాలను లేదా నిర్మాణాలను కూల్చకుండానే బాబ్రీ మసీదును కట్టినట్టు ఆధారాలు ఉన్నాయన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ ప్రయోజనాల కోసం ఈ నిర్మాణాన్ని ఇతరులకు అప్పగించడానికి ఏ వ్యక్తికిగానీ, సంస్థకుగానీ అధికారాలు లేవని స్పష్టం చేశారు.  సుప్రీంకోర్టు సైతం దీనిని స్థలవివాదంగా మాత్రమే ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ వివాదంపై గతంలో తాము మధ్యవర్తిత్వం వహించామని, అది విఫలమైందని గుర్తుచేశారు.


ప్ర‌స్తుత‌  వివాదం స్థలం గురించి మాత్రమే కాదని సుప్రీంకోర్టు న్యాయవిధానానికి ఓ పరీక్ష అని సయీద్‌ అర్షద్‌ మదాని వ్యాఖ్యానించారు. న్యాయస్థానం నమ్మకం, విశ్వాసాలను బట్టి కాకుండా ఆధారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని తీర్పు ఇస్తుందని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు. ‘ఏది ఏమయినా ఈ దేశం మనది, చట్టాలు మనవి, సుప్రీంకోర్టు మనది. కాబట్టి తీర్పు ఎలా ఉన్నా మేము గౌరవిస్తాం’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఆరెస్సెస్‌ అధిపతి మోహన్‌ భాగవత్‌తో సమావేశం కావడంపై మదాని స్పందించారు. హిందూ ముస్లింల ఐక్యత కోణంలోనే తాము సమావేశమైనట్టు తెలిపారు. దేశంలో హిందూముస్లింలు సోదరభావంతో మెలగాలని తమ సంస్థతోపాటు ఆరెస్సెస్‌ కూడా కోరుకుంటున్నదన్నారు.ఇదిలాఉండ‌గా, సుప్రీంకోర్టు ఈ నెల 17లోగా తుది తీర్పు వెల్లడిస్తుందని అంచనాల నేప‌థ్యంలో... అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించారు. ఇప్పటికే యూపీలో అధికారులకు సెలవులను రద్దు చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: