ఇక పై అయ్యప్ప మాల వేసుకొని దీక్ష చేపట్టే పోలీసులు సెలవుపై వెళ్లాలని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయి. విధులకు హాజరయ్యే పోలీసులు తప్పకుండా ఖాకీ యూనిఫాం ధరించాలని ఆయన ఆదేశించారు. అయ్యప్ప దీక్ష తీసుకునేవారు కఠిన నియమాలను పాటించాల్సి ఉంటుంది. కానీ అయ్యప్ప దీక్ష చేపట్టే పోలీసులు కచ్చితంగా యూనిఫాం ధరించాలని రాచకొండ సీపీ ఆదేశించారు.


యూనిఫాం, షూ లేకుండా పోలీసులు విధులు నిర్వహించడం కుదరదని మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. అయ్యప్ప దీక్ష చేపట్టే సిబ్బంది సెలవు తీసుకోవాలని సూచించారు. క్రమశిక్షణ కలిగిన పోలీస్‌ శాఖలో ప్రత్యేక అనుమతులు ఇవ్వడం కుదరదని. గడ్డాలు, మీసాలు పెంచుకొని పోలీసులు విధులు నిర్వహించడం కుదరదని అయన తేల్చి చెప్పారు.కాగా రాచకొండ సీపీ మహేష్ భగవత్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. అయ్యప్పమాల వేసుకొని డ్యూటీకి రావొద్దని మెమో జారీ చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. రంజాన్ సమయంలో ఇలాంటి మెమోలు రిలీజ్ చేయాలని అనిపించలేదా అని ప్రశ్నించారు. హిందువులకు ఒక చట్టం, ముస్లింలకు ఒక చట్టమా? అని పోలీస్ కమిషనర్‌పై మండిపడ్డారు అయన.


ముస్లింలకు రంజాన్ సమయంలో ఎలా సడలింపు ఇస్తారో, హిందువులకు కూడా అలాగే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాల వేసుకొని విధుల్లోకి రావొద్దంటూ ఆదేశించాలని ఎవరు ఆర్డర్ వేశారని సీపీని రాజాసింగ్ ప్రశ్నించారు. ఈ ఆదేశాలు పై నుండి వచ్చాయా? సీఎం నుంచి వచ్చాయా? అని నిలదీశారు. ఎంఐఎం ఆఫీసు నుంచి ఈ మెమో రిలీజ్ అయితే అందరికి ఫార్వార్డ్ చేస్తున్నారా? అంటూ ఆయన ఫైర్ అయ్యారు.


రంజాన్ సమయంలో టోపీలు, గడ్డాలు తీసేయాలని మెమోలు జారీ చేయగలరా? అని సీపీని బీజేపీ ఎమ్మెల్యే నిలదీశారు. అయ్యప్పమాల వేసుకున్న వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే జరిగే పరిణామాలపై మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: