క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఓ కేసులో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ పై మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో  అరెస్టయిన చింతమనేని ఏలూరు జైలులో రిమాండ్ ఖైదిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

 

తాజాగా నమోదైన నాలుగు కేసుల విచారణతో మాజీ ఎంఎల్ఏ ఇప్పట్లో  బెయిల్ పై బయటకు వచ్చే పరిస్ధితి కనిపించటం లేదు.  అధికారంలో ఉన్నపుడు చేసిన పాపాలే ఇపుడు చింతమనేనిని వెంటాడుతున్నాయనే అనుకోవాలి.  టిడిపి అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఎవరిని పడితే వారిని కొట్టేవారు. తిట్టేవారు.

 

నిండు సభల్లోనే బహిరంగంగా అధికారులను బండబూతులు తిట్టి ధౌర్జన్యం చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. చింతమనేని వ్యవహారంపై ఎంతమంది ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అప్పట్లో పై అధికారులు పట్టించుకోలేదు. అధికారులపైనే ధౌర్జన్యం చేసిన చింతమనేని ప్రతిపక్షమైన వైసిపిని వదిలేస్తారా ? వైసిపి నేతలపైన కూడా ఇష్టమొచ్చినట్లు దాడులు చేశారు.

 

సరే మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టి ఎంత ఘోరంగా ఓడిపోయిందో దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని కూడా అలాగే ఓడిపోయారు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుండే మాజీ ఎంఎల్ఏకి కష్టాలు మొదలయ్యాయి. ఐదేళ్ళల్లో మాజీ ఎంఎల్ఏ బాధితులంతా ఒక్కసారిగా పోలీసుస్టేషన్ బాట పట్టారు. దాంతో పోలీసులు ఫిర్యాదులు తీసుకుని కేసులు కట్టడం మొదలుపెట్టారు.

 

చింతమనేని బాధితుల్లో ఎక్కువమంది ఎస్సీలే ఉన్నట్లు సమాచారం. దాంతో సుమారు 7 కేసుల దాకా ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు నమోదైనట్లు సమాచారం. ఇపుడు రిమాండ్ లో ఉండటానికి కూడా ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసే కారణం. ఇప్పటికే చాలాసార్లు ఎంఎల్ఏ బెయిల్ తెచ్చుకోవటం వెంటనే మరో కేసులో విచారణ  జరిగి మళ్ళీ రిమాండ్ విధించటమే సరిపోతోంది. దాంతో చింతమనేని మీద నమోదైన కేసులు కోర్టులో విచారణ జరిగితే అసలు బెయిల్ దొరుకుతుందా అన్నదే అనుమానంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: