విశాఖ‌లోని అర‌కు వ్యాలీ గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచి తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వైసీపీ నేత‌, సీనియ‌ర్ నాయ‌కుడు చెట్టి ఫాల్గుణ మ‌రింత ప‌ట్టు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా? ఆయ‌న దూకుడులో వేగం పెంచారా?  వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా వైసీపీకి మ‌రింత ప‌ట్టు పెంచేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారా? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. నిజానికి ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో అర‌కు నియోజ‌క‌వ‌ర్గానికి చాలా ప్ర‌త్యేక‌త ఉంది.


ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా ఏడు మాసాల ముందు ఇక్క‌డ నుంచి ప్రాతినిధ్య వ‌హించిన కిడారి సర్వేశ్వ‌ర‌రావును న‌క్స‌ల్స్ ప‌ట్ట‌ప‌గ‌లే కాల్చి చంపారు. 2014లో ఆయన వైసీపీ నుంచి గెల‌చి, త‌ర్వాత ఎస్టీ కోటాలో మంత్రి ప‌ద‌విపై ఆశ‌తో పార్టీ మారిపోయారు. అయితే, దీనినిస‌హించ‌ని న‌క్స‌ల్స్ అనేక కార‌ణాలు చూపుతూ..ఆయ‌న ప‌ట్ట‌ప‌గ‌లే చంపారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కుమారుడు కిడారి శ్రావ‌ణ్‌ను చంద్ర‌బాబు మంత్రి ని చేయ‌డంతోపాటు ఆయ‌న‌కు పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా క‌ల్పించారు.


ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆయ‌న‌పై ప్ర‌జ‌ల్లో సానుభూతిని పార్టీవైపు మ‌ళ్లించేందుకు, త‌ద్వారా గెలుపు గుర్రం ఎక్కించేందుకు బాబు ప్ర‌య‌త్నించారు. దీంతో ఇక్క‌డ సానుభూతి రాజకీయాలు పెరుగుతాయ‌ని అంద‌రూ అనుకున్నారు. ఈ నేప‌థ్యంలో పోరు కూడా హోరా హోరీగా సాగుతుంద‌ని అనుకున్నారు.  కానీ, అనూహ్యంగా వైసీపీ అభ్య‌ర్థిగా రంగంలోకి దిగిన చెట్టి ఫాల్గుణ‌ను ప్ర‌జ‌లు భారీ మెజారిటీతో గెలిపించారు. ప్ర‌జ‌ల్లో ఉండ‌డం, గిరిజ‌న స‌మ‌స్య‌ల‌పై పూర్తి అవ‌గాహ‌న ఉన్న నాయ‌కుడిగా గుర్తింపు పొంద‌డం వంటి కార‌ణాలు చెల్లి ఫ‌ల్గుణ‌కు క‌లిసి వ‌చ్చాయి. పైగా జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడుగా కూడా పేరు తెచ్చుకున్నారు.


అలాంటి నాయ‌కుడు ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంపై పూర్తి ప‌ట్టును పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వందకోట్లతో అరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల రోడ్లు అనుసంధాన పనులు త్వరలో ప్రారంభిస్తామని  ఫాల్గుణ తెలిపారు. పాడేరులో మెడికల్‌ కళాశాలతోపాటు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు జరుగుతుందని, నియోజకవర్గంలో 28 వేలకు పైగా రైతులకు రైతు భరోసా అందిందని, వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ద్వారా 756 మందికి పైగా పదివేలు ప్రోత్సాహంగా ఇచ్చినట్లు వెల్లడించారు.


సంతల్లోని రైతులకు షెడ్ల నిర్మాణానికి పంతొమ్మిది కోట్లు కేటాయించినట్లు.. 25 కి.మీ సీసీ రోడ్ల నిర్మాణానికి ఎనిమిది కోట్లు కేటాయించినట్లు తెలిపారు. లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తామ‌న్నారు. ప్రతి గ్రామానికి తాగునీరు సదుపాయం కల్పించనున్నామని వివ‌రించారు. ఈ వ్యూహంతో ఇక‌, అర‌కులో వైసీపీకి గ‌ట్టి పునాదులే ప‌డ‌తాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: