రాజకీయాల్లో ఎపుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొంత మేరకు అంచనాలు మాత్రమే ఎవరైనా వేయగలుతారు. ముందే ఇలా జరిగి తీరుతుందని చెప్పడానికి రాజకీయాలు గణిత శాస్ర  లెక్కలు కాదు, ఇక్కడ రెండూ రెండూ నాలుగు కావచ్చు, కాకపోవచ్చు కూడా. బీజేపీతో విడిపోతే గెలవవచ్చు అని 2019 ఎన్నికల వేళ  చంద్రబాబు అనుకున్నారు. ఆయనది నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం. అపర చాణక్యుడని పేరు. అటువంటి బాబే బొల్తా కొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు.


అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ లో ఓ అనుమానం మాత్రం ఉందిని ప్రచారమైతే సాగుతోంది.  అదేంటి అంటే ప్రజారాజ్యం పార్టీని 2009 ఎన్నికల తరువాత కాంగ్రెస్ లో విలీనం చేయకపోయి ఉంటే  2014 ఎన్నికల్లో  తప్పకుండా తమ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి దక్కేదన్నది ఆయన అంచనాట. అలా కాకుండా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసేవరకూ కొందరు నాయకులు వూరుకోలేదని వారిలో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు, ప్రస్తుతం వైసీపీ మంత్రి కన్నబాబు ఉన్నారని పవన్ అనుమానం. అందుకే వారి మీద ఆయన ఆగ్రహం కూడానని ప్రచారమైతే  సాగుతోంది.


అయితే 2009 తరువాత వైఎస్సార్ చనిపోవడంతో రాజకీయాలు ఉమ్మడి ఏపీలో ఒక్కసారిగా మారిపోయాయి. జగన్ అపుడే కొత్త  రాజకీయ శక్తిగా అవతరించారు. ఇక విభజనను నాడు ఎవరూ పెద్దగా వూహించలేదు. కాంగ్రెస్ ఉమ్మడి ఏపీకి కట్టుబడి ఉంటుందని అనుకున్నారు. ఒకవేళ విభజన జరగకపోతే కాంగ్రెస్ ఇంతలా దారుణంగా నష్టపోయి ఉండేది కాదు. ఆ పార్టీ కూడా బలంగా   ఉండేది. ఇక టీడీపీకి ఉమ్మడి ఏపీలో బలం సగం పడిపోయేది. వైసీపీకి ఉమ్మడి ఏపీలో అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే తెలంగాణాలో రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉన్నారు కాబట్టి. మరో వైపు టీయారెస్ ఎంత పుంజుకున్నా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ బలం వల్ల ఇంతలా ఎదిగేది కాదన్నది మరో మాటగా ఉంది.


ఇక విభజన జరగకపోతే కాంగ్రెస్ లో చిరంజీవి పార్టీ విలీనం కూడా కరెక్ట్ అని పవన్ తో సహా అంతా అంగీకరించేవారు కూడా. విభజన వల్లనే చిరంజీవి కూడా ఎటూ కాకుండా పోయారు. విభజన వల్ల మొదట లాభపడింది  టీడీపీయే. కోస్తాలో ఆ పార్టీ పటిష్టంగా ఉండడం ప్రధాన‌ కారణం. ఒకవేళ చిరంజీవి పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాకుండా ఉండి  విభజన ఏపీ  ఎన్నికల్లో పోటీ చేసినా టీడీపీ ఓట్లు చీలిపోయి జగనే 2014లో సీఎం అయ్యేవారు. 


రాజకీయ విశ్లేషణలు ఇలా ఉంటే పవన్ మాత్రం ప్రజారాజ్యం కంటిన్యూ అయి ఉంటే 2014 ఎన్నికల్లోనే తమ కుటుంబానికి సీఎం పదవి వచ్చేదని బాధ పడుతున్నట్లుగా ప్రచారంలో ఉంది. అయితే రాజకీయాలు అనుకున్నట్లుగా ఉండవు కాబట్టి ప్రజారాజ్యం విషయంలో ఇంటెర్వల్ తరువాత కధ ఏంటన్నది ఎవరి  ఆశలు, ఊహలకే పరిమితం. ఇక జనసేన మీద ప్ర్రజారాజ్యం ప్రభావం పడిందన్నది వాస్తవం. మరి పవన్ పాత తప్పులను చేయకుండా ముందుకు సాగితే ఆయనకు కూడా రాజకీయాల్లో అవకాశాలు దక్కవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు ఎవరూ ఎక్కువా కాదు, తక్కువా కాదు కాబట్టి. 



మరింత సమాచారం తెలుసుకోండి: