ఆర్టీసీ సమ్మె 34 వ రోజుకు చేరుకుంది.  తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.  తమ న్యాయబద్ధమైన 26 డిమాండ్లతో పాటుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ కార్మికులు పట్టుబడుతున్నారు.  కానీ, ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు.  సమ్మె విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 


పైగా సమ్మె చేస్తున్న కార్మికులపై చర్యలు తీసుకుంది.  గతంలో సెల్ఫ్ డిస్మిస్ పేరుతో కార్మికులను తొలగిస్తున్నట్టు చెప్పింది.  తరువాత డెడ్ లైన్ విధించింది.  అయినప్పటికీ కార్మికులు ఎవరూ కూడా విధుల్లోకి చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.  కాగా, దీనికి సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నది.  ఇప్పటికే ప్రభుత్వం దీనిపై అఫిడవిట్ దాఖలు చేసింది.  ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవని చెప్పింది.  


ఆర్టీసీ బకాయిల విషయంలో అంతా క్లియర్ గా ఉన్నట్టుగా నివేదిక ఇచ్చింది.  ఇక ఈరోజు ఈ కేసుపై విచారణ జరగబోతున్నది.  ఈరోజుతో ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారం వెలువడే  అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది.  ఈ కేసు విషయంలో ఈరోజు తెలంగాణ సీస్ ఎస్కె జోషి, ఫైనాన్స్ సెక్రటరీ, ఆర్టీసీ ఇంచార్జ్ ఎండి, జీహెచ్ఎంసి కమిషనర్ తదితరులు కోర్టు ముందు హాజరు కాబోతున్నారు.  ప్రభుత్వం తరపున తమ బలమైన వాదనను వినిపించబోతున్నారు.  


కాగా, ఈరోజు ఉదయం నుంచి ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు సమ్మె చేస్తున్నారు.  ఈ సమ్మెలో కార్మికులంతా పాల్గొన్నారు.  కొంతమంది కార్మికులు విధుల్లోకి వెళ్లినా.. వారుసైతం తిరిగి సమ్మెలో పాల్గొంటున్నట్టు సమాచారం.  నిన్నటి రోజున సమ్మెలో కొంత ఉద్రిక్తత నెలకొంది.  విధుల్లోకి వెళ్లిన కొంతమంది ఉద్యోగులపై కార్మికులు చేయి చేసుకున్నారు.  దీంతో అక్కడ ఉద్రిక్తకరమైన వాతావరణం నెలకొన్నది.  విధుల్లోకి చేరిన కార్మికులకు రక్షణ కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: