అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పలు నిజాలు బయటపడుతున్నాయి. అసలు విజయారెడ్డి హత్యకు ప్రధాన కారణం ఓ ఒప్పందం అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాచారం గ్రామంలో 412 ఎకరాల భూమి ఉంది. అసలు ఈ భూమికి యజమాని రాజా ఆనందరావు. 1950 నుంచే ఈ భూమిని రైతులు కౌలుదారులుగా సాగు చేస్తున్నారు. 1980 నుంచి రాజా ఆనందరావు ఆచూకీ లేదు. అప్పటికే గౌరెల్లి, బాచారం, బండరావిరాల గ్రామస్థులు ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. అయితే రాజా ఆనందరావు ఆచూకీ లేకపోవడంతో కౌలుదారులు తాము సాగు చేస్తున్న భూమిని తమ పేరు మీదే చేయించుకోవాలని చూశారు. ఇంతలో రక్షితదారు హబీబ్ ఈ భూమి పై తనకే అధికారాలు ఉన్నాయని కోర్టులో పిటిషన్ వేశారు. అలాగే రైతులను కాదని భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే ధైర్యం హాబీబ్ చేయలేకపోయాడు. 


అయితే ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో భూ వ్యాపారుల కన్ను ఈ భూముల పై పడింది. రైతులకు, కౌలుదారులకు మాయమాటలు చెప్పి ఇద్దరి ఒప్పందంతో ఆ భూములను కొని మార్కెట్ ధరకు వారు అమ్ముకుంటున్నారు. బాచారం గ్రామంలో 90 నుంచి 101 సర్వే నంబర్ లో ఉన్న 130 ఎకరాలను 27 మంది సాగు చేసుకుంటున్నారు. అందులో సురేష్ తాత వెంకయ్యకు 7 ఎకరాలు ఉంది. ఇందులో సురేష్ తండ్రి కృష్ణకు 2 ఎకరాలు వచ్చింది. సురేష్ ఏ పని చేయకపోవడంతో అతనికి అప్పులు పెరిగాయి. దీంతో సురేష్ తండ్రి కృష్ణ ఓ ఎకరం అమ్మి అప్పు తీర్చి అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో ఇల్లు కొనాలని సురేష్ కు సూచించినట్టు తెలుస్తోంది. 


దీంతో సురేష్ భూ వ్యాపారులకు విషయం చెప్పాడు. వారికి ఆ భూమి పై కన్నుపడింది. సురేష్ ఒక్కడే అమ్మడానికి వీలు లేకపోవడంతో హబీబ్ తో జత కట్టాడు. ఇద్దరు కలిసి ఎకరం భూమిని అమ్మేందుకు సిద్దమయ్యారు. రైతులకు భూ వ్యాపారులు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇంతలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు హైకోర్టు హాబీబ్ కు అనుకూలంగా తీర్పునిచ్చాయి. దీంతో తాను భూమి అమ్మనని హబీబ్ అన్నాడు. దీని పై సురేష్ తో పాటు పలువురు రైతులు హైకోర్టులో కేసు వేశారు. 

ప్రస్తుతం దీని పై  కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున పట్టా జారీ చేయలేనని ఎమ్మార్వో విజయారెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఏం చేయాలో తోచక సురేష్ ఎమ్మార్వో విజయారెడ్డిని హత్య చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి భూ వ్యాపారులతో సురేష్ భూ అమ్మకానికి చేసుకున్న ఒప్పందమే ఎమ్మార్వో విజయారెడ్డి ప్రాణాలు తీసేలా చేసిందని స్పష్టమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: