గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నాడనే సామెతలాగ తయారైంది ఆర్టీసీ సమ్మె విషయం. నిరవధిక ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో ప్రధాన కార్యదర్శి, సంస్ధ ఇన్చార్జి ఎండి, ఆర్ధికశాఖ కార్యదర్శి లాంటి ఉన్నతాధికారులందరు ఇపుడు కోర్టులో నిలబడాల్సొస్తోంది. సమ్మె విషయంలో కేసియార్ కాస్త తెలివిగా వ్యవహరించుంటే ఇపుడీ పరిస్ధితి దాపురించేదే కాదనటంలో సందేహమే లేదు.

 

 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది ప్రధాన డిమాండ్. డిమాండ్లు చాలానే ఉన్నప్పటికి చర్చల ద్వారా సానుకూలమయ్యేవి చాలానే ఉన్నాయని కోర్టు అభిప్రాయపడటంలో తప్పేమీలేదు. సంస్ధ విలీనం సాధ్యంకాదని కేసియార్ అభిప్రాయపడితే ముందే కార్మిక సంఘాల్లోని ముఖ్యమైన నేతలను పిలిపించుకుని మాట్లాడుంటే సరిపోయేది.

 

విలీనం చేయటం వల్ల ఎదురయ్యే సమస్యలను నేతలకు స్వయంగా కేసియారే నచ్చచెప్పుండాలి. కేసియారే ఎందుకు మాట్లాడాలంటే ప్రభుత్వంలోని మంత్రులు, ఉన్నతాధికారులందరూ కొయ్యగుర్రాల్లాంటి వాళ్ళే కాబట్టి.  పైగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో స్వయంగా కేసియారే ఆర్టీసీ యూనియన్ లీడర్లను తన దగ్గరకు పిలిపించుకుని సమ్మె చేసేట్లు అప్పట్లో ఒప్పించారు. కాబట్టే ఇపుడు కేసియారే తమతో చర్చలు జరపాలని వాళ్ళు పట్టుబడుతున్నారు.

 

యూనియన్ నేతలను దగ్గరకు పిలిపించుకుని వాళ్ళ ఇగోని శాటిస్ఫై చేయాల్సిన ముఖ్యమంత్రి చాలా అవమానకరంగా మాట్లాడి వాళ్ళ ఇగోపై దెబ్బకొట్టారు.  దాని ఫలితమే  34 రోజుల నిరవధిక సమ్మె. పైగా సమ్మెకు కోర్టు కూడా మద్దతుగా నిలబడటంతో కేసియార్ ఎన్ని బెదిరింపులు చేస్తున్నా వాళ్ళు లెక్క చేయటం లేదు. ఏం చేస్తావో చేసుకో అన్నట్లుగా కేసియార్ కే సవాలు విసరటంతో  సమస్య బాగా ముదిరిపోయింది.

 

అదే సమయంలో సమ్మె విషయంలో  ప్రభుత్వాన్ని తప్పుపడుతూ కోర్టు కొన్ని సూచనలు చేసింది.  ఆర్టీసీ ఖర్చులు, లాభనష్టాల విషయంలో  కోర్టుకిచ్చిన నివేదికలో  ప్రభుత్వం తప్పుడు రిపోర్టిచ్చిందంటూ న్యాయమూర్తి బాగా సీరియస్ అయ్యారు. అప్పటి నుండి ప్రభుత్వ నివేదికలపై కోర్టుకు నమ్మకం పోయింది.  దాన్ని అవమానంగా భావించిన సిఎం కోర్టు సూచనలను లెక్కే చేయటం లేదు. దాంతో కోర్టుకు మండిపోవటంతో చివరకు ఉన్నతాధికారులు కోర్టులో నిలబడాల్సొస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: