అయిదేళ్ల పాటు మానసికంగా, ఆర్ధికంగా నష్టపోయిన అగ్రిగోల్డ్ బాధితుల వ్యధకు నేడు కొంతమేర తెర పడబోతోంది. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో అగ్రిగోల్డ్ బాధితులు కుదుటపడబోతున్నారు. 10వేల రూపాయల లోపు అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్లు అందజేయనుంది ప్రభుత్వం. ఈరోజు గుంటూరు వేదికగా సీఎం జగన్ ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టనున్నారు. గత ప్రభుత్వ హయాంలో హామీ మాత్రమే లభించి ఎదురుచూపులతోనే సరిపెట్టుకున్న బాధితులు వైస్ జగన్ నిర్ణయంతో సేద తీరబోతున్నారు.

 


బాధితులకు న్యాయం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో పదివేల లోపు డిపాజిటర్లకు 1150 కోట్లను కేటాయించింది. ఇందుకు గానూ తొలివిడతలో భాగంగా ఈనెల 18న దాదాపు 264 కోట్లను విడుదల చేయనుంది ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలోని 3లక్షల 50వేలకు పైగా అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఉపశమనం లభించనుంది. వారి మోముల్లో చిరునవ్వులు పూయిస్తా.. అన్న జగన్ హామీ నెరవేరుస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 11గంటలకు నగరంలోని పోలస్ పెరేడ్ గ్రౌండ్స్ లో సీఎం జగన్ పాల్గొని బాధితులకు చెక్కులు అందజేయనున్నారు. త్వరలో 20వేల లోపు డిపాజిటర్లకు కూడా నగదు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది.

 

 

 2014లో మూతపడ్డ అగ్రిగోల్డ్ కంపెనీలో రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది తమ నగదును డిపాజిట్ చేసి మోసపోయారు. దీంతో కోర్టులో కేసులు నమోదయ్యాయి. కంపెనీ డెరక్టర్లు అరెస్ట్ అయ్యారు. కానీ బాధితులకు మాత్రం తీవ్ర అన్యాయమే జరిగింది. ఓపక్క అగ్రిగోల్డ్ ఆస్తుల లెక్క, విక్రయాలకు సంబంధించి లావాదేవీలు ఇంకా ఓ కొలిక్కి రాకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై డిపాజిటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మాత్రమే కాకుండా ప్రభుత్వం తమకు అండగా ఉంది అనే ధైర్యాన్ని అగ్రిగోల్డ్ బాధితులు వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: