ఈరోజుల్లో సహజ ప్రసవాలు తగ్గిపోయాయి. ఆసుపత్రికి వెళ్తే దాదాపు సిజేరియన్ ఆపరేషన్ ఖాయం. కనీసం 20 వేల నుంచి 50వేల రూపాయల బిల్లు తప్పకుండా అవుతోంది. ఖరీదైన ఆసుపత్రులైతే ఇది ఇంకా ఎక్కువే. అయితే. ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లిన ఓ జంటకు అనుకోని షాక్ ఎదురైంది. ఏకంగా ఐదు కోట్ల రూపాయలు బిల్లు వచ్చింది.


అసలే పొట్టకూటి కోసం వలస వచ్చిన ఆ జంట ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్‌ కి చెందిన సయ్యద్‌ జహీద్‌ సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాడు. విజిటింగ్‌ వీసాపై ఏడాది క్రితం భార్యను తన దగ్గరకు తెచ్చుకున్నాడు. అక్కడే ఆమెకు గర్భం వచ్చింది. విచిత్రం ఏంటంటే.. అక్కడ గర్భవతులను విమానప్రయాణం చేయనివ్వరట. అందువల్ల ఇండియాకు పంపిద్దామనుకున్నా కుదరలేదు.


ఇంతలో ఏడో నెలలోనే ఆమెకు నొప్పులు వచ్చాయి. అత్యవసరం కావడంతో భార్యను రియాద్‌లో ఓ ఆసుపత్రిలో చేర్చాడు. అక్కడే కథ అనుకోని మలుపు తిరిగింది. జహీద్ భార్య ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు తల్లయ్యింది. అందులోనూ నెలలు నిండకుండా పుట్టడంతో నెలల తరబడి ఇంక్యూబేటర్లలో ఉంచాల్సి వచ్చింది. ఇప్పటికే జహీద్.. తన దగ్గరున్న నాలుగున్నర లక్షలు చెల్లించాడు. కానీ నలుగురు బిడ్డలు కావడంతో .. మొత్తం పిల్లలకే రోజుకు 7 లక్షల వరకూ బిల్లు వస్తోంది.


ఈ ఖర్చులు భరించలేక ఇండియా వద్దామంటే.. నిబంధనలు ఒప్పుకోవు. దీంతో మొత్తం మీద బిల్లు 5 కోట్ల రూపాయలకు చేరింది. పొట్టకూటి కోసం వచ్చిన తాను అంత సొమ్ము ఎలా చెల్లించాలో అర్థంకాక సాయం కోసం చూస్తున్నాడు జహీద్. విజిటింగ్ వీసా ఇస్తున్నారు కదా అని ముచ్చటపడి భార్యను తెచ్చుకున్న జహీద్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయాడు. ఒక్క కాన్పులోనే నలుగురు బిడ్డలు పుట్టడం.. ఆసుపత్రి నిబంధనలు, విమానాశ్రయం నిబంధనలు ఇలా అన్నీ అనుకోని షాక్ ఇవ్వడంతో జహీద్ ఎవరైనా ఆదుకోవాలంటూ వేడుకుంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: