రిలయన్స్, అదాని గ్రూప్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెనక్కి వెళుతున్నాయని కొన్ని పత్రికలలో వచ్చిన అసత్య కథనాలపై ఏపీ ఐ.టీ, వాణిజ్య శాఖ  మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. అదాని, రిలయన్స్ సంస్థలు వెనక్కి వెళుతున్నాయని వచ్చిన వార్తలు,కథనాలు, ప్రచారంలో వాస్తవం కాదని పరిశ్రమలుమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పారదర్శకత, నిజాయతీ, జవాబుదారీతనానికి కట్టుబడి ముందుకెళుతున్నామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

పరిశ్రమలకు ప్రభుత్వం కేటాయించే భూ కేటాయింపుల విషయంలో కొన్ని విధివిధానాలుంటాయన్నారు. ‘సులభతర వాణిజ్య విధానం’ కోసం ‘సింగిల్ విండో విధానం’లో భూ కేటాయింపులు, అనుమతులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.`రిలయన్స్ సంస్థకు తిరుపతి కేంద్రంగా గత ప్రభుత్వం 136 ఎకరాల భూములు కేటాయించింది, కానీ ఆ ప్రాంత రైతులు సుమారు 15 మంది న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేయడంతో వివాదాస్పదంగా మారింది. కేటాయించిన భూములు వినియోగించకోలేని పరిస్థితి రావడంతో మా ప్రభుత్వం రిలయన్స్ కోసం మరో భూమిని ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసింది` అని మంత్రి స్పష్టం చేశారు. ముందు ప్రభుత్వంలోలాగా కాకుండా ఎలాంటి సమస్యలు రాని క్లియర్ టైటిల్ ఉన్న భూమి ఏపీఐఐసీ ద్వారా రిలయన్స్ సంస్థకు ఇవ్వడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రిలయన్స్ సంస్థతో త్వరలోనే చర్చలు జరపనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.


అదాని గ్రూపు విషయానికి వస్తే.. ప్రాజెక్టు ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని, ఆ సంస్థ ప్రతిపాదనలపై ఇప్పటికే ఐ.టీ శాఖ రూపొందించిన ప్రణాళికలు ప్రాసెస్ లో ఉన్నాయని మంత్రి తెలిపారు.  త్వరలోనే దాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అదాని గ్రూప్ తో ప్రభుత్వ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను, ప్రయోజనాలను దెబ్బతీసే అబద్ధపు వార్తలను మీడియా ప్రచారం చేయవద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు సానుకూల వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం అంకితభావంతో ముందుకు వెళుతుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: