మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఇంతకాలానికి మళ్ళీ బయట కనిపించారు. రాజధాని గ్రామమైన రాయపూడిలో తిరిగిన టిడిపి నేతల బృందంలో మాజీ మంత్రి చాలా యాక్టివ్ గా కనిపించటమే విశేషం. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ జనాలకు కూడా నారాయణ కనిపించటం గగనమైపోయింది. పార్టీతో పాటు నారాయణ కూడా నెల్లూరు నియోజకవర్గంలో ఓడిపోయిన విషయం తెలిసిందే.  దాంతో టెన్షన్ ఫీలైన మాజీమంత్రి రాజకీయంగా సైలైంట్ గా ఉండిపోయారు.

 

యాక్టివ్ గా లేకపోయినా పర్వాలేదు కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా కనిపించటం మానేసినట్లు మిగిలిన నేతలు చెప్పుకుంటున్నా పట్టించుకోలేదు.  చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లాలో రెండు రోజులు పర్యటించినా మాజీ మంత్రి అడ్రస్ లేరు. నిజానికి నారాయణ రాజకీయ నాయకుడు ఏమీ కాదు. చంద్రబాబుకు ఆర్ధిక అండదండలు అందిచటం వల్లే పార్టీలో తెరవెనుక ప్రముఖునిగా చెలామణి అయ్యారనే ప్రచారం జరిగింది.

 

అదే సమయంలో 2014లో పార్టీ అధికారంలోకి రావటంతోనే నారాయణ హవా మొదలైంది. అప్పటి వరకూ తెరవెనుక రాజకీయాలకే పరిమితమైన విద్యాసంస్ధల అధిపతి ఏకంగా మంత్రే అయిపోయారు. రాజధాని ఎంపిక, తాత్కాలిక నిర్మాణాలు తదితరాల విషయంలో నారాయణ ఎంత కీలకంగా ఉన్నారో అందరికీ తెలిసిందే. అప్పట్లో అంత యాక్టివ్ గా ఉన్న నారాయణ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయారు ?

 

ఎందుకంటే తన వ్యాపారాలపై అధికారపార్టీ కన్ను ఎక్కడ పడుతుందో అన్న భయం నారాయణను వెంటాడుతోందని సమాచారం. దానికి తోడు విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్ధలను ప్రభుత్వం మూసేయించింది. దాంతో మాజీమంత్రిలో టెన్షన్ పెరిగిపోయింది.

 

తన ఆర్ధికబలానికి విద్యాసంస్ధలే ప్రధాన కారణమని మాజీమంత్రికి బాగా తెలుసు. విద్యా సంస్ధల్లో చాలా వరకు నిబంధనలకు అనుగుణంగా లేవట. అందుకనే ప్రభుత్వానికి భయపడి ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న నారాయణ హఠాత్తుగా తెరపైకి ఎందుకు వచ్చినట్లు ? అదే ఎవరికీ అర్ధం కావటం లేదు. మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అయ్యే ఉద్దేశ్యంలో నారాయణ ఉన్నారా ? అన్నదే తెలియటం లేదు. చూద్దాం నాలుగు రోజులు ఆగితే తేలిపోతుంది కదా ?


మరింత సమాచారం తెలుసుకోండి: