బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు కోసం ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు ఇకనుండి క్యూ కట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని అకౌంట్లో ఉన్న నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ల్యాండ్ లైన్ లేదా మొబైల్ ద్వారా టోల్ ఫ్రీ నంబర్ 155299 కు ఫోన్ చేసి రిక్వెస్ట్ పంపితే మొబైల్ మైక్రో ఏటీఎంతో మీ ఏరియా పోస్ట్ మేన్ మీ ఇంటికే వస్తారు. మొబైల్ మైక్రో ఏటీఎం ద్వారా 100 రూపాయల నుండి 10,000 రూపాయలు విత్ డ్రా చేసుకోవచ్చు. 
 
పోస్టల్ శాఖ బ్యాంకింగ్ సేవలకు శ్రీకారం చుట్టింది. వివిధ బ్యాంకుల ఖాతాదారులు ఆధార్ నంబర్ ద్వారా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ తో నగదును ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా విత్ డ్రా చేయవచ్చు. ఆధార్ ఏటీఎం పేరుతో తపాలాశాఖ ఈ సేవలను విస్తరిస్తోంది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ విధానంపై తపాలాశాఖ హైదరాబాద్ నగర పరిధిలో 950 మంది పోస్ట్ మేన్ లకు శిక్షణ ఇచ్చింది. 
 
తపాలాశాఖ మైక్రో ఏటీఎం యాప్ ను మొబైల్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసి మొబైల్ ఫోన్ సైతం పోస్ట్ మేన్ లకు అందజేసింది. కస్టమర్లు రిక్వెస్ట్ పంపిన వెంటనే ఏరియా పోస్ట్ మేన్ ఇంటి వద్దకు వస్తారు. పేరు మొబైల్ నంబర్ మైక్రో ఏటీఎంలో ఎంటర్ చేసిన వెంటనే కస్టమర్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత ఆధార్ నంబర్ చెప్పాలి. ఆ తరువాత బ్యాంక్ పేరు, ఎంత నగదు కావాలో ఎంటర్ చేసి కస్టమర్ బయోమెట్రిక్ తీసుకొని పోస్ట్ మేన్ నగదు అందజేస్తారు. 
 
ఈ సేవలు పొందాలంటే ఖచ్చితంగా బ్యాంకు ఖాతా ఆధార్ నంబర్ తో అనుసంధానమై ఉండాలి. ఏరియా పోస్ట్ మేన్ ల ద్వారా ఇంటి నుండే ఆధార్ ఏటీఎం సేవలను పొందవచ్చు. వికలాంగులు, వృద్ధులు, మహిళలకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇందుకోసం ఎటువంటి సర్వీస్ చార్జ్ చెల్లించనవసరం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: