అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజ‌యారెడ్డిపై స్థానికుడైన‌ సురేశ్ పెట్రోల్ పోసి నిప్పు అంటించిన ఘ‌ట‌న తెలుగు రాష్ట్రాల్లో  సంచ‌ల‌నం రేపింది. అయితే, త‌హ‌సీల్దార్ విజ‌యా రెడ్డిని స‌జీవ ద‌హ‌నం చేసిన నిందితుడు సురేశ్ గురువారం మృతిచెందాడనే వార్త‌లు పెద్ద ఎత్తున చెలామ‌ణి అయ్యాయి. అయితే, ఉస్మానియా హాస్ప‌ట‌ల్ ఆర్ఎంవో డాక్ట‌ర్ మొహ‌మ్మ‌ద్ ర‌ఫీ ఈ వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చారు. నిందితుడు సురేశ్ బుధ‌వారం రాత్రి నుంచి వెంటిలేట‌ర్‌పై ఉన్నాడ‌ని, శ్వాస తీసుకోవ‌డం ఇబ్బందిగా ఉండ‌డంతో...ఇంకా వెంటిలేట‌ర్‌పై కొన‌సాగుతున్నాడ‌ని ర‌ఫీ తెలిపారు. 

త‌హ‌సీల్దార్‌పై పెట్రోల్‌తో దాడి చేసిన ఘ‌ట‌న‌లో సురేశ్ సుమారు 60 శాతం కాలిన గాయాల‌తో పోలీస్ స్టేష‌న్‌కు చేరుకున్నాడు అనంత‌రం సురేశ్‌ను ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలో నాలుగు రోజులుగా కొన‌ప్రాణాల‌తో కొట్టుమిట్టాడిన సురేశ్‌.. ఇవాళ తుదిశ్వాస విడిచాడని ప్ర‌చారం జ‌రుగ‌గా...దాన్ని ఉస్మానియా వైద్యులు తోసిపుచ్చారు. 60 శాతం కాలిన గాయాల‌తో ఆస్ప‌త్రిలో చేరిన సురేశ్‌కు చికిత్స కొన‌సాగిస్తున్నామ‌ని తెలిపారు. ఇదిలాఉండ‌గా, ఉస్మానియా ఆస్ప‌త్రిలో సురేశ్ చికిత్స పొందుతున్న వార్డు వ‌ద్ద అత‌ని భార్య ఇవాళ ఉద‌యం స్పృహ త‌ప్పి ప‌డిపోయింది. ఆమెను క్యాజువాల్టీ వార్డుకు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. మ‌రోవైపు ఆస్ప‌త్రి వ‌ద్ద‌కు కుటుంబ‌స‌భ్యులు చేరుకున్నారు.


కాగా, విజ‌యారెడ్డిని హ‌త్య చేసిన ఘ‌ట‌న గురించి సురేశ్ నుంచి పోలీసులు స‌మాచారం సేక‌రించార‌ని తెలుస్తోంది.  విజ‌యారెడ్డిని హ‌త్య చేయడం వెనుక కార‌ణాలు, తహ‌శీల్దార్ హ‌త్య చేసేందుకు ఎవరైనా స‌హ‌క‌రించారా? అనే విష‌యంలో...పోలీసులు ఆరాతీసిన‌ట్లు స‌మాచారం. అయితే, సురేశ్ నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు ఆ వివ‌రాల‌ను అధికారికంగా వెల్ల‌డించాల్సి ఉంది.

ఇదిలాఉండ‌గా, తహ‌శీసిల్దార్ విజయారెడ్డి హత్యకేసు దర్యాప్తులో భాగంగా విచారణ అధికారి, వనస్థలిపురం ఏసీపీ మరోసారి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రాథమికంగా సేకరించిన ఆధారాలను విశ్లేషించారు. నిందితుడు సురేశ్ ఇంత దూకుడుగా వ్యవహరించడం వెనుక ఎవరైనా రెచ్చగొట్టి ఉంటారా? అని ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ఘటనకు ముందు మూడ్రోజుల్లో ఎవరితో ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడారనే విషయంపై ఆరాతీస్తున్న పోలీసులు అందుబాటులో ఉన్నవారిని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: