కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభం సందర్భంగా పాకిస్తాన్ విడుదల చేసిన వీడియోపై దుమారం రేగుతోంది. అటు పంజాబ్ లో  సిద్దూ, పాక్ ప్రధాని కలిసున్న పోస్టర్లు, బేనర్లపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. గురునానక్‌ కు సంబంధించిన పవిత్ర స్థలం కావటంతో  సిక్కులు కర్తార్‌ పూర్‌ సందర్శించటానికి ఆసక్తిచూపుతారు. 


భారత్ -పాక్ సరిహద్దులో ఉన్న కర్తాపూర్ కారిడార్ ప్రారంభంపై పాకిస్తాన్ విడుదలచేసిన వీడియో వివాదాస్పదంగా మారింది. అమృతసర్ లో నవజ్యోత్ సింగ్ సిద్దూ, ఇమ్రాన్ ఖాన్ కలిసి వున్న పోస్టర్లపై కూడా అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఈ కార్యక్రమానికి సరిహద్దుల్లో ఉన్న అసంఖ్యాక సిక్కులను ఆహ్వానిస్తూ పాకిస్తాన్ ఓ వీడియో విడుదలచేసింది. 


పాక్ సమాచార శాఖ రిలీజ్ చేసిన  వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ పాటలో ఖలిస్తాన్  వేర్పాటువాద నేతలు కనిపించే దృశ్యాలు ఉండడంతో వివాదం రేగుతోంది. ఖలిస్తానీ వేర్పాటు నేతలు జర్నేల్ సింగ్ భింద్రన్వాలే, మేజర్ జనరల్ షాబేగ్ సింగ్, అమ్రిక్ సింగ్ ఖల్సాలు.. పాట బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ఓ పోస్టర్ లో కనిపిస్తారు. వాస్తవానికి ఈ వేర్పాటువాదులు 1984లో గోల్డెన్ టెంపుల్ వద్ద జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ లో చనిపోయారు.


ఆలయంలోకి చొరబడ్డ ఉగ్రవాదులను తరిమేందుకు అప్పట్లో ఇండియన్ ఆర్మీ.. బ్లూస్టార్ ఆపరేషన్ చేపట్టింది. మరోవైపు అమృత్ సర్ లో సిద్దూ, ఇమ్రాన్ ఖాన్ పోస్టర్లు ప్రముఖంగా కనిపించాయి. కర్తార్ పూర్ కారిడార్‌ ఏర్పాటులో  వీరు కీలకపాత్ర పోషించారంటూ ఇద్దరి ఫోటోలు ఫ్లెక్సీలో ఏర్పాటుచేశారు. ఈ కారిడార్‌ ప్రారంభంతో ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతి, మత సామరస్యం పెరుగుతాయని తమ ప్రధాని ఆశిస్తున్నట్లు పాకిస్తాన్ సమాచార శాఖ చెప్తోంది. ఈ శనివారం ...నవంబర్ 9వ తేదీన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కారిడార్ ను ప్రారంభిస్తారు.


పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఉన్న డేరా బాబా నానక్ విగ్రహం నుంచి పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ లో ఉన్న దర్బార్ సాహిబ్ గురుద్వారా వరకు ఈ కారిడార్ ను నిర్మించారు. గురునానక్ 550వ జయంతి సందర్భంగా ఈ కారిడార్ ను ప్రారంభిస్తున్నారు.  వివాదాస్పద వీడియోలో శిరోమణి అకాళీదల్ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ లతో పాటు, సినీ నటి పూనం కౌర్ కూడా ఉన్నారు.


కర్తార్ పూర్ కారిడార్ ఏర్పాటు కావాలంటూ సిక్కులు గతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఈ కారిడార్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి పంజాబ్ మంత్రి హోదాలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాకిస్తాన్ వెళ్లారు. అక్కడ పాకిస్తాన్ మంత్రిని కౌగిలించుకోవడం అప్పట్లో పెద్ద ఎత్తున దుమారానికి దారి తీసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: