పంజాబ్... హర్యానా రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యం పెరగటానికి ఆ రెండు రాష్ట్రాలే కారణమని వ్యాఖ్యానించింది. పంట వ్యర్థాల దహనంపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించింది  న్యాయస్థానం. పశువులు చనిపోతే పట్టించుకునే ప్రభుత్వాలు... మనుషులు చనిపోయే పరిస్థితి వస్తే పట్టించుకోవా అంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 


దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీ కాలుష్య ఛాంబర్‌లా మారింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పశువుల ప్రాణాలు పోతే పట్టించుకునే ప్రభుత్వాలకు మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా అని ప్రశ్నించింది. ప్రజల గురించి పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారంలో ఉండే హక్కు లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. 


ఈ ఏడాది కూడా పంట వ్యర్థాలను తగలబెడతారని అందరికీ తెలుసినా ప్రభుత్వాలు ఎందుకు ముందస్తు చర్యలు చేపట్టలేదు అని ప్రశ్నించింది. పంట వ్యర్థాల దహనాన్ని ఎందుకు నివారించలేదని నిలదీసింది.  రైతుల నుంచి పంట వ్యర్థాలను సేకరించడమో, కొనుగోలు చేయడమో ఎందుకు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలు విఫలమయ్యాయని వ్యాఖ్యానించింది. అధికారులను శిక్షించే సమయం వచ్చింది అని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం రెండు రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా ప్రశ్నించింది. 


ఇది కోట్లాది మంది జీవన్మరణ సమస్య. ప్రజలు ఇలా కాలుష్యంలో చావాల్సిందేనా..?అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. కాలుష్యం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయో ఊహించుకోవాలంటేనే కష్టంగా ఉందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పశువుల చనిపోతే పట్టించుకుంటారు గానీ.. మనుషుల ప్రాణాలకు విలువ లేదా? అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 'విమానాలను దారిమళ్లించాల్సి వస్తోందని తెలిపింది. ప్రజలకు తమ ఇళ్లల్లోనే రక్షణ లేకుండా పోతోందని..ఇవన్నీ చూస్తుంటే మీకు సిగ్గుగా అన్పించట్లేదా' అని దుయ్యబట్టింది. ఖరీదైన బంగ్లాలో కూర్చుని పాలిస్తున్న ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని మర్చిపోవడం, పేదల గురించి పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ కాలుష్యానికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యులని తెలిపింది. పంట వ్యర్థాల దహనంపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. 



మరింత సమాచారం తెలుసుకోండి: