ఎవరికి వారే యమునా తీరే అనే చందాగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఎందుకంటే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేటితో 34 రోజులు అవుతుంది. అయినా సమ్మె విషయంలో అటు ప్రభుత్వం గాని, ఇటు కార్మికులు గాని పట్టువీడకుండా ఉన్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంది కాబోలు ఆ దిశగా అడుగులు కూడా వేస్తుంది. అందుకే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి కావలసిన పావులు కదుపుతుంది.


ఇకపోతే స్వచ్ఛందంగా విధుల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసి రెండు రోజులైపోయింది. అయినా, కార్మికుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ప్రభుత్వం కీలక ప్రకటన దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తుంది.. ఇక కార్మికులు విధుల్లో చేరకపోతే మిగతా రూట్లనూ ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించి,


ఈ క్రమంలోనే ప్రైవేటు బస్సుల రూటు పర్మిట్లపై చర్చిస్తున్నారట.. ఇకపోతే ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెబుతున్న కేసీయార్ గారికి ప్రైవేటు వాహనదారులు కాంట్రాక్ట్ క్యారేజెస్‌గా పర్మిట్ ఉన్న తమ వాహనాలను స్టేజి క్యారేజీలుగా తిప్పుతూ ప్రజాధనాన్ని దోచుకుంటూ, ప్రయాణీకులను అక్రమంగా రవాణా చేయటం వల్ల ఆర్టీసికి సాలీనా వెయ్యి కోట్ల రూపాయలు నష్టం కలుగుతోందని తెలియదా.


ఈ విషయంలో ఇలాంటి వారిపై, అటు ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ వారు కాని, ఇటు పోలీస్ డిపార్ట్ మెంట్ గాని ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ రవాణా ఇబ్బ‌డి ముబ్బడిగా పెరిగిపోయి ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసి ఉనికికే ఇప్పుడు ప్రమాదం తెచ్చిపెట్టింది.


ఇక మరో విషయం ఏంటంటే నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసికి ఉన్న 3 వేల కోట్ల రూపాయల నష్టాలలో ప్రభుత్వం ఇవ్వవలసిన 2 వేల కోట్ల రూపాయలు, ప్రైవేటు అక్రమ రవాణాను ఆపటం వల్ల వెయ్యికోట్ల రూపాయలు ఆర్టీసికి వస్తే సంస్థ నష్టాల్లో ఎందుకు ఉంటుంది?


అలాగే ప్రభుత్వంఆర్టీసీకి అన్ని రకాల ట్యాక్సులు మినహాయిస్తే సాలీనా వెయ్యి కోట్ల రూపాయల లాభాల్లో ఉంటుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి వాదోపవాదల నడుమ అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు సమయాన్ని వృధాచేసుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటే సమస్య పరిష్కారం అవ్వదు.


దీనివల్ల ఈ రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రజలు కార్మికులు నష్టపోవలసిందే గాని కేసీయార్ గారికి పావలా కూడా నష్టం జరుగదు. ఆర్ధిక ఇబ్బందులవల్ల సామాన్యుడు చావవల్సిందే గాని నాయకులు, ఒక్కరుకూడా రోడ్డున పడరు.ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఇప్పుడున్న పరిస్దితిలో టీఎస్ఆర్టీసీ భవిత్యం..అగమ్య గోచరంగా కనిపిస్తుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: