తహశీల్దార్‌ విజయారెడ్డిని హత్య చేసిన సురేష్‌ తొలుత ఆటో డ్రైవర్‌. స్థిరాస్తి వ్యాపారం పుంజుకోవడంతో ఇందులోకి దిగాడు. గ్రామంలో అందరితో బాగానే ఉండేవాడని చెబుతున్నారు స్థానికులు. అయితే ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని అంటున్నారు. తన వాటా భూమిని రాజకీయంగా పలుకుబడి ఉన్న ఒక వ్యక్తికి అమ్మేయడంతో.. భూమిపై హక్కుల్లేక కొనుగోలుదారు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పాస్‌ పుస్తకాల కోసమే సురేష్‌ ఇంతటి దారుణానికి పాల్పడి ఉండొచ్చనే  అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. 


తహశీల్దార్‌ విజయారెడ్డిపై సురేష్‌కు ఎందుకంత కోపం? ఇప్పుడిదే మిస్టరీగా ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం సురేష్‌కు మతిస్థిమితం సరిగ్గా లేదని.. రెచ్చగొట్టగానే రెచ్చిపోయే స్వభావమని చెబుతున్నారు. ఈ వైఖరినే ఆసరాగా చేసుకొని ఎవరైనా తహశీల్దార్‌పై  దాడి చేసేందుకు సురేష్‌ను వాడుకున్నారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. తహశీల్దార్‌పై దాడికి ముందు చాలా సార్లు పెదనాన్న దుర్గయ్యతో నిందితుడు సురేష్‌ మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు. 


తహశీల్దార్‌పై దాడికి సురేష్‌ను దుర్గయ్యే ఉసిగొల్పాడా ..వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే అనుమానాలూ ఉన్నాయ్‌. భూ వివాదాన్ని పరిష్కరించనందుకు నిరసనగా పెట్రోల్‌తో తహశీల్దార్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం చేయాలని  చెప్పి.. సురేష్‌ను పంపారని ఒక వాదన వినిపిస్తోంది. అయితే తీవ్ర వాగ్వాదం జరగడంతో క్షణికావేశంలో తహశీల్దార్‌పై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టి ఉంటారని  సందేహిస్తున్నారు. మరోవైపు కాలిన గాయాలతో చికిత్సపొందుతున్న సురేష్ చనిపోయాడు.   


సురేష్ వల్ల రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇటు విజయారెడ్డి కుటుంబంలో తల్లిని కోల్పోయారు ఇద్దరు పిల్లలు. అమ్మ ఎక్కడికి వెళ్లింది.. ఎప్పుడొస్తుంది.. అని పిల్లలు అడిగే ప్రశ్నకు పెద్దల దగ్గర సమాధానం లేదు. అటు విజయారెడ్డి భర్త ఆ చిన్నారులకు ఎలా వారిని సముదాయించాలో తెలియక లోలోన కుమిలిపోతున్నాడు. మరోవైపు విజయారెడ్డికి నమ్మిన బంటుగా ఉన్న డ్రైవర్ గురునాథం ఇంట్లో కూడా విషాద చాయలు అలుముకున్నాయి. గురునాథంకు భార్య, ఒక బాబు ఉన్నారు. అతని భార్య ఇపుడు ఎనిమిది నెలల గర్భవతి. 








మరింత సమాచారం తెలుసుకోండి: