తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ ఉద్యోగులు హడలిపోతున్నారు. విధి నిర్వహాణలో ఏమైనా జరగొచ్చనే భయంతో.. తమ కార్యాలయాల దగ్గర ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీలో పలుచోట్ల తహసీల్దార్ ఆఫీసులనే టార్గెట్ చేసుకున్నారు బాధితులు. 


విజయారెడ్డి దారుణ హత్య రెండు రాష్ట్రాల రెవిన్యూ ఉద్యోగులలో తెలియని అలజడి సృష్టించింది. బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. కర్నూల్ జిల్లా పత్తికొండ తహసీల్దార్ ఉమామహేశ్వరి అయితే.. తన చాంబర్‌కు అడ్డంగా ఓ తాడు కట్టించారు. అర్జీలు ఇచ్చేవారు ఎవరైనా తాడు బయట నుంచే ఇవ్వాలని, లోపలకి ఎవరినీ అనుమతించొద్దని ఆదేశించారు. తహసీల్దార్ ముందు జాగ్రత్త చూసి సిబ్బందితోపాటు స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. 


చిత్తూరు జిల్లాలో ఓ రైతు కుటుంబం రామకుప్పం తహశీల్దార్ ఆఫీసులో ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. రామకుప్పం మండలం  తగరాలతాండ తమ భూమిని అన్యాక్రాంతం జరిగిందంటూ ఆ కుటుంబం ధర్నాకు దిగింది. ఎన్నిసార్లు విన్నవించుకున్నా తమ గోడు వినడం లేదంటూ ఆఫీసు ఎంట్రన్స్ లో ఊరి వేసుకునేందు ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. కొద్దిసేపు ఆఫీసులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో ఉద్రిక్తత తలెత్తింది. దూకులపాడు గ్రామవాసి జగన్మోహన్ రావు  రైతు భరోసా కార్యక్రమంలో పెట్రోల్ పోసుకుని... అధికారులపై కూడా చల్లే ప్రయత్నం చేసాడు.  పొలంలో తవ్విన డ్రైన్లు పూడ్చకపోవడంతో అసహనానికి గురయ్యాడు రైతు. కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రావు పొలానికి ఇరువైపులా డ్రైన్ల కోసం తవ్విన గోతులను తాము పూడ్చడం కుదరదని చెప్పడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు జగన్మోహన్ రావు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు నరసన్నపేట పోలీసులు. 


చిత్తూరు జిల్లా... కురబలకోట ఎమ్మార్వో ఆఫీసులో ఓ రైతు వినూత్న నిరసన చేపట్టాడు. అధికారులు పాస్‌బుక్‌ కోసం ఆరు నెలులుగా ఇబ్బంది పెడుతున్నారంటూ... కార్యాలయంలోనే నిద్రపోతూ ఆందోళన చేపట్టాడు. అధికారులు స్పందించి తన సమస్యను పరిష్కిరించే వరకూ నిరసన విరమించేది లేదని తేల్చి చెప్పాడు. కురబలకోట మండలం ఆర్‌సి కురవపల్లెకు చెందిన బాలకృష్ణ పాస్‌బుక్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇంతలోనే ఆన్‌లైన్ నుంచి తన భూమిని డిలీట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. 


విజయారెడ్డి హత్యకు నిరసనగా.. ఆందోళన చేస్తున్న ఓ రెవెన్యూ ఉద్యోగికి లంచం సెగ తగిలింది. గుండాల తహశీల్దార్ కార్యాలయం ముందు రెవన్యూ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అయితే ఓ మహిళ వీఆర్‌ఓ వద్దకు వచ్చి.. తన దగ్గర లంచం తీసుకున్నట్టు ఆరోపించింది. తన డబ్బులు తీసుకొని పాస్ బుక్ ఇవ్వలేదని, మర్యాదగా ఇవ్వకుంటే.. గల్లా పట్టుకొని గుంజుతానని మండిపడింది. చట్టప్రకారం వ్యవహారించే తమపై వ్యక్తిగతంగా దాడులకు దిగడం సరికాదని తెలంగాణ, ఏపీ రెవిన్యూ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఏప్పుడు ఏమి జరుగుతుందోనంటూ ఒత్తిడిలో పని చేయాల్సి వస్తుందని వాపోతున్నారు.  











మరింత సమాచారం తెలుసుకోండి: