ఐసిస్ భారత్ ను కూడా టార్గెట్ చేసిందని అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం బయటపెట్టింది. ఆప్ఘానిస్థాన్ తో భారత్ కు బలమైన సంబంధాలు ఉండటంపై పాక్ ఆందోళనగా ఉందని చెప్పింది. తాలిబన్లు అయితే భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తారనే ఉద్దేశంతో.. దాయాది దేశం వారితో సత్సంబంధాలు కొనసాగిస్తోందని తేల్చిచెప్పింది. 


ఐసిస్ గత సంవత్సరం భారత్‌లోనూ దాడులకు  యత్నించిందని అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. కానీ వారు  చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయన్నారు. ఐసిస్‌కు చెందిన ఖొరసన్‌ గ్రూప్‌ ఈ మేరకు ప్రణాళికలు రచించిందని అమెరికా ఉగ్రవాద  నిరోధక కేంద్రం డైరెక్టర్‌ వెల్లడించారు. భారత సంతతికి చెందిన  సెనేటర్ మ్యాగీ హాసన్‌ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ఐసిస్‌కు  అనుబంధంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థల్లో.. ఐసిస్‌-కె నే అత్యంత  ప్రమాదకరమని ఆయన అన్నారు. ఇన్నాళ్లు కేవలం అప్ఘనిస్థాన్‌పైనే  గురిపెట్టిన ఈ సంస్థ గత సంవత్సరం ఇతర ప్రాంతాలకూ తన ప్రణాళికలు  విస్తరించిందని తెలిపారు. అందులో భాగంగా భారత్‌లో ఆత్మాహుతి దాడికి  యత్నించారని.. కానీ అది విఫలమయ్యిందని చెప్పారు. 


ప్రపంచవ్యాప్తంగా ఐసిస్‌కు అనుబంధంగా 20గ్రూపులు పనిచేస్తున్నాయని తేలింది. వీటిలో కొన్ని సంస్థలు ఉగ్రదాడులకు డ్రోన్ లాంటి అత్యాధునిక పరిజ్ఞానం కూడా వాడుతున్నాయి. ఇరాక్‌లో ఐసిస్‌ని పూర్తిగా తుడిచిపెట్టినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన  దాని మూలాలు అమెరికాకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందన్నారు. అల్‌ఖైదా ఇప్పటికీ.. హక్కానీ నెట్‌వర్క్‌ సహా పాకిస్థాన్‌, అప్ఘనిస్థాన్‌లోని పలు  ఉగ్రసంస్థలతో సంబంధాలు కొనసాగిస్తోందన్నారు.   


అప్ఘనిస్థాన్‌తో భారత్‌కున్న మెరుగైన సంబంధాల వల్ల పాకిస్థాన్  ఆందోళన చెందుతోందని అమెరికా అభిప్రాయపడింది. అందుకే తాలిబన్ లతో పాక్‌ సత్సంబంధాలను కోరుకుంటోందన్నారు. భారత్‌కు తాలిబన్లు అయితేనే వ్యతిరేకంగా వ్యవహరిస్తారని పాక్ భావిస్తోందన్నారు. అఫ్గాన్‌లో బలహీనమైన ప్రభుత్వం  ఉండాలని పాక్‌ కోరుకుంటోందన్నారు. అప్ఘనిస్థాన్‌ విషయంలో దశాబ్దాలుగా పాక్ ప్రతికూల పాత్ర పోషిస్తోందని  నివేదిక స్పష్టం చేసింది. అమెరికాకు వ్యతిరేకంగా పోరాడుతున్న తీవ్రవాదులకు పాకిస్థాన్‌  ఆశ్రయం కల్పిస్తోందన్న అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యల్ని నివేదికలో  పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: