మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన 1600 హౌసింగ్‌ ప్రాజెక్టుల కోసం 25 వేల కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేసింది. దీనికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 


రియల్టీ రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో జోష్‌ నింపేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మధ్య, చిన్న ఆదాయ రియల్టీ ప్రాజెక్టులకు, సగంలో నిలిచిపోయి పూర్తి కాని ప్రాజెక్టులకు కేంద్రం నిధులను సమకూరుస్తుంది. తద్వారా సంబంధిత ప్రాజెక్ట్‌ పూర్తి కావడానికి  సాయపడుతుంది. ఇందుకోసం రూ.25 వేల కోట్ల విలువైన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్రం 10వేల కోట్ల రూపాయలను ఇన్వెస్ట్‌ చేస్తుంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిగతా నిధులు సమకూరుస్తాయి. 


నగదు కొరత కారణంగా నిలిచిపోయిన, రెరాలో నమోదైన ప్రాజెక్టులను రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు పూర్తి చేసే అవకాశం లభించనుంది. ఈ నిధిని ప్రొఫెషనల్స్‌ నిర్వహిస్తారనీ, ఈ నిధి మూలంగా దాదాపు మూడున్నర లక్షల మంది మధ్య తరగతి గృహ కొనుగోలుదారులకు ప్రయోజనం కలుగుతుందని  ఆర్థికమంత్రి వివరించారు. 1,600 రియాల్టీ ప్రాజెక్టులు నిలిచిపోవడంతో.. భారతదేశంలో సుమారు 4.58 లక్షల హౌసింగ్ యూనిట్లు చిక్కుకున్నాయని అంతర్గత సర్వేలో తేలిందని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.


కేబినెట్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో అటు ఉద్యోగాల కల్పనతో పాటు, సిమెంట్‌, స్టీల్‌కు డిమాండ్‌ పెంచి ఆయా రంగాల వృద్ధికి ఊతం కల్పించినట్లయింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం తరుణంలో గత కొన్ని రోజులుగా పలు చర్యలు చేపడుతూ వస్తున్న ప్రభుత్వం.. తాజాగా స్థిరాస్తి రంగంపై దృష్టి  పెట్టింది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా ఉంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: