లడ్డూలలో తిరుపతి లడ్డూకు ఉన్నంత ప్రాముఖ్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. తిరుపతి లడ్డూకు ఉన్నంత రుచి, ప్రాముఖ్యత ప్రపంచంలో ఏ లడ్డూకు ఉండదు. ప్రత్యేకమైన పద్దతులను పాటించి తిరుపతి లడ్డూలను తయారు చేస్తారు. శ్రీవారి భక్తులు తిరుపతి లడ్డూలను ఇంటికి తీసుకెళ్లడం కొరకు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. తిరుపతి లడ్డూలలో మూడు రకాలు ఉంటాయి. ఆస్థానం లడ్డూ, కళ్యాణోత్సవ లడ్డూ మరియు ప్రోక్తం లడ్డూ. 
 
ఆస్థానం లడ్డూలను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. ఈ లడ్డూ బరువు 750 గ్రాములు ఉంటుంది. ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా మాత్రమే ఈ లడ్డూలను తయారు చేస్తారు. కళ్యాణోత్సవ లడ్డూ కళ్యాణోత్సవం ఆర్జిత సేవలకు హాజరయ్యే గృహస్థులకు మాత్రమే ప్రసాదంగా ఇస్తారు. సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు ఇచ్చే లడ్డూలను ప్రోక్తం లడ్డూ అంటారు. తిరుపతి లడ్డూ తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకుండా భౌగోళిక ఉత్పత్తి లైసెన్స్ కూడా లభించింది. 
 
ఒక్కప్పుడు బియ్యప్పిండితో చేసే లడ్డూ ప్రసాదాన్నే తిరుమల వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. ఈ లడ్డూలను మనోహరాలని పిలిచేవారు. కర్ణాటక రాష్ట్రంలోని మెల్కోటే దేవాలయంలో ఇప్పటికీ మనోహరాలనే ప్రసాదంగా ఇస్తారు. సాధారణంగా తిరుపతి లడ్డూలను తయారు చేయటానికి పటిక బెల్లం, జీడిపప్పు, కర్పూరం, యాలుకలు, ఎండుద్రాక్ష, నెయ్యి, బెల్లం, పటిక, స్వచ్చమైన శనగపిండి ఉపయోగిస్తారు. ఇకనుండి తిరుపతి లడ్డూ మరింత ప్రత్యేకం కానుంది.

తాజా జీడిపప్పులను తిరుపతి లడ్డూ తయారీకి కేరళ  నుండి తెప్పించుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఒప్పందం కుదుర్చుకుంది. తాజా జీడిపప్పులను ఉపయోగించటం వలన తిరుపతి లడ్డూ మరింత రుచిగా తయారు కానుంది. జీడిపప్పు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ఎస్ జయమోహన్ ఈ ఒప్పందం వలన 70 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: