ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన బాగుంది కాబట్టే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించేందుకు మొగ్గుచూపుతున్నారని వైసిపి నేతలు అంటున్నారు.  ఇటీవల విశాఖలో జనసేన ఆద్వర్యం లో నిర్వహించిన  లాంగ్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ మంచి పాలన అందిస్తే తనకు ఇలాంటి కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు.  తాను కూడా ఎంచక్కా   సినిమాలు చేసుకుంటానని చెప్పుకొచ్చారు .


 పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ వేదికగా చేసిన  వ్యాఖ్యలను  వైసీపీ నాయకులు తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు . దానికితోడు    పవన్ కళ్యాణ్ త్వరలోనే తిరిగి  సినిమాల్లో నటిస్తారని  ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేత అంబటి రాంబాబు లు వేర్వేరుగా మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రం లో జగన్ పాలనా బాగుంది కాబట్టే ... పవన్ మళ్లీ సినిమాలో నటించబోతున్నారని వ్యాఖ్యానించారు .


 రాజకీయంగా వైసీపీ నేతలు తనపై దాడి తీవ్రతరం చేసిన నేపథ్యంలో మళ్లీ సినిమాల్లో నటించేందుకు పవన్ కళ్యాణ్ అంతగా ఆసక్తిగా చూపడం  లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.  ఒకవేళ తాను తిరిగి  సినిమాల్లో నటిస్తే వైసీపీ చేసిన విమర్శలు నిజమవుతాయని భావిస్తున్న ఆయన,  సినిమా పరిశ్రమకు దూరం కాకుండా ఉండేందుకు  తమ  కుటుంబ హీరోలతో  సినిమాలు నిర్మించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కార్యక్రమం ద్వారా మరోసారి ప్రజల్లోకి వచ్చారు .


లాంగ్ మార్చ్ కార్యక్రమానికి ఊహించినదానికంటే  ప్రజలు  అధిక సంఖ్యలో హాజరుకావడంతో పవన్ , జనసేన నాయకత్వం హ్యాపీగా ఉన్నారు . ఇదే దూకుడు కొనసాగించడం ద్వారా వైస్సార్ కాంగ్రెస్ సర్కార్ ను ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: