అమరావతిలో తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఓ లేడి ఎంఎల్ఏనే కారణమని తెలుస్తోంది.  మూడు రోజుల క్రితం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం హఠాత్తుగా బదిలీ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఉరుములేని పిడుగులాగ ఎల్వీ బదిలి వార్త బయటకు పొక్కగానే  అధికారయంత్రాంగం ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆయన బదిలికి ఇతర కారణాలు ఎన్నున్నా ఓ లేడి ఎంఎల్ఏ వివాదం కూడా ముఖ్యమైనదే అనే ప్రచారం జరుగుతోంది.

 

రాజధాని నియోజకవర్గమైన తాడికొండ(ఎస్సీ)లో మొన్నటి ఎన్నికల్లో వైసిపి తరపున పోటి చేసిన ఉండవల్లి శ్రీదేవి గెలిచారు. అయితే ఆమె ఎస్సీ కాదని బిసి అంటూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్ధ  కార్య నిర్వాహక అధ్యక్షుడు సంతోష్ ఫిర్యాదు చేశారు. మొదట తన ఫిర్యాదును జిల్లా కలెక్టర్ కే పంపారట. అయితే కలెక్టర్ పట్టించుకోలేదు. తర్వాత తన ఫిర్యాదును రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపారు.

 

ఎన్నికల సంఘానికి పంపిన తన ఫిర్యాదు అక్కడి నుండి  మళ్ళీ కలెక్టర్ కే వచ్చింది. విషయం తెలుసుకున్న సంతోష్ లాభం లేదనుకుని నేరుగా రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కే పంపారు. విషయాన్ని గమనించిన రాష్ట్రపతి కార్యాలయం ఆ ఫిర్యాదును ప్రధాన కార్యదర్శికి పంపింది. 

 

ఎప్పుడైతే రాష్ట్రపతి కార్యాలయం నుండి ఆదేశాలు వచ్చాయో ఎల్వీ వెంటనే యాక్షన్లోకి దిగారట. తన తరపున ప్రత్యేకంగా ఓ అధికారిని విచారణ నిమ్మితం నియమించారట. ఆ విషయం ఎంఎల్ఏకి తెలియగానే జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్య చెప్పుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ఓ సీనియర్ అధికారి ఈ విషయంలో చూసి చూడనట్లు వెళ్ళాలని చేసిన సూచనను ఎల్వీ పట్టించుకోలేదట.

 

ఇక్కడ విషయం ఏమిటంటే రాష్ట్రపతి కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలపై సక్రమంగా యాక్ట్ చేయకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకనే ఎల్వీ కూడా విచారణ విషయంలో గట్టిగానే ఉన్నారట. నిజానికి తాను క్రిస్తియన్ అని స్వయంగా శ్రీదేవే చాలాసార్లు చెప్పారు. తన తండ్రి ఎస్సీ కాబట్టి తాను కూడా ఎస్సీనే అని వాదిస్తున్నారు.

 

అయితే ఎస్సీలు క్రిస్తియన్లుగా మారితే  వెంటనే బిసి కేటగిరిలోకి మారిపోతారంటూ సంతోష్ వాదిస్తున్నారు. అందుబాబులో ఉన్న సమాచారం ప్రకారం ప్రధాన కార్యదర్శి నిష్పక్షపాతంగా విచారణ జరిపితే శ్రీదేవి ఎంఎల్ఏ పదవి పోవటం ఖాయమనే తెలుస్తోంది.  ఎంఎల్ఏ సామాజికవర్గం వివాదంలో తెరవెనుక జరిగిన ఇంత తతంగం కూడా ఎల్వీ బదిలీకి ప్రధాన కారణంగా అర్ధమవుతోంది. మరి కొత్తగా వచ్చే ప్రధాన కార్యదర్శి ఏం చేస్తారో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: