ఆర్టీసీ సమ్మె విషయంలో హై కోర్టు చీఫ్ సెక్రటరి అండ్ కో ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో కేసియార్ కు అవమానం జరిగినట్లే లెక్క. నేరుగా కేసియార్ ను ఏమీ అనలేకే ప్రధాన కార్యదర్శి, ఆర్ధిక కార్యదర్శి, రవాణా కార్యదర్శి, ఆర్టీసీ ఇన్చార్జి ఎండిలపై ఘోరంగా వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తి కామెంట్లతో చివరకు ప్రధాన కార్యదర్శి క్షమాపణలు చెప్పుకోవాల్సొచ్చిందంటే ప్రభుత్వ  పరిస్ధితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమైపోతోంది.

 

34 రోజులుగా నిరవధికంగా జరుగుతున్న సమ్మె నేపధ్యంలో కోర్టుకు ప్రభుత్వం కొన్ని లెక్కలను అందించింది. ఆ లెక్కల్లో ఆర్టీసీ ఎండి ఇచ్చిన లెక్కలకు, ఆర్దికశాఖ కార్యదర్శి సమర్పించిన లెక్కలకు పొంతనే లేదు. పైగా రవాణాశాఖ మంత్రికి ఇచ్చిన నివేదికలో ఉద్దేశ్యపూర్వకంగానే తప్పులున్నట్లు ఎండి అంగీకరించటమే విచిత్రంగా ఉంది.

 

నిజానికి గోటితో పోయే విషయాన్ని కేసియార్ గొడ్డలిదాకా తెచ్చుకున్నారు. ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయటం సాధ్యంకాక పోతే అదే విషయాన్ని యూనియన్ నేతలను పిలిపించుకుని నచ్చచెప్పే ప్రయత్నం చేయాల్సింది. ఆపని చేయకుండా యూనియన్ నేతల ఇగోను దెబ్బకొట్టారు. దాని ఫలితమే నిరవధిక సమ్మె, జనాల ఇబ్బందులు, సిబ్బంది ఆత్మహత్యలు,  కోర్టు ముందు అవమానాలు.

 

సమ్మె ఈ స్ధాయికి చేరుకుంటుందని కోర్టు ముందు ప్రభుత్వం తలొంచుకోవాల్సొస్తుందని కేసియార్ ఊహించలేదా అన్నదే అసలు సమస్య. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు వివిధ శాఖలు కోర్టుకు రకరకాల లెక్కలతో నివేదికలు ఇస్తోందని ఘాటుగా వ్యాఖ్యలు చేసిందంటే ఏమిటర్ధం ?

 

మంత్రినే తప్పుదోవపట్టించేట్లుగా నివేదిక ఇచ్చిన తర్వాత అసలు మీ మాటలను ఎందుకు నమ్మాలంటూ కోర్టు ఆర్టీసీ ఎండిని నిలదీసిందంటే ఇంతకన్నా అవమానం ఇంకోటుంటుందా ?  కోర్టు ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులను అడిగిన ప్రశ్నలన్నీ కేసియార్ ను ఉద్దేశించి అడిగినవనే అనుకోవాలి. ఎందుకంటే సిఎంను కోర్టుకు రమ్మని ఆదేశించలేకే ఉన్నతాధికారులను కోర్టుకు రప్పించుకుంది. కాబట్టి కేసియార్ కు ఘోర అవమానం జరిగినట్లే లెక్క.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: