లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ దొరికాడో జిల్లా పంచాయితీ అధికారి. ఓ సర్పంచ్‌ ఆడిట్‌ రిపోర్ట్‌ ని క్లియర్‌ చేయటం కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ప్రభుత్వ అధికారుల అవినీతి చర్చకొస్తున్న తరుణంలోనే ఓ అధికారి ఇలా పట్టుబడటం చర్చగా మారింది.  


తహసిల్దార్ హత్యతో ప్రభుత్వ అధికారుల్లో అవినీతి.. లంచాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలయింది. వీఆర్వో నుంచి... మొదలు పెట్టి.. వివిధ స్థాయిల్లోని అధికారులతో నానా తిప్పలు పడుతున్నామని ఇప్పటికే అనేమంది రైతులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. విజయా రెడ్డి హత్యను సమర్ధించనప్పటికీ... ఏళ్ల తరబడి తిప్పుకుంటూ నానా తిప్పలు పెడుతున్న రెవిన్యూ అధికారులపై సామాన్యుల్లో పేరుకున్న అసహనాన్ని మాత్రం సూటిగానే వెళ్లగక్కుతున్నారు. అయితే ఈ సమయంలో కూడా ఓ జిల్లా పంచాయితీ అధికారి లంచం తీసుకుంటూ దొరికాడు.


కీసర జిల్లా పంచాయితీ అధికారి రవికుమార్ లక్షరూపాయలు లంచం తీసుకుంటూ దొరికాడు. మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య ఆడిట్ రిపోర్ట్ క్లియర్ చెయ్యడం కోసం రవికుమార్ 5 లక్షలు డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా లక్ష రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సోషల్ మీడియా పోస్టులు ఓ సారి గమనిస్తే, ప్రభుత్వ అధికారులతో ప్రజలు పడే ఇబ్బందులు స్పష్టమవుతాయి. లంచం ఇవ్వనిదే కదలని ఫైళ్లు, సొంత భూమిని కూడా తమదే అని రుజువు చేసుకోటానికి నెలల తరబడి రెవిన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతులెందరో తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తహశీల్దార్ విజయారెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ ఘటన వెనుక నిజానిజాలేవైనప్పటికీ, అధికారుల్లో అవినీతి కారణంగా ప్రజల్లో అసహనం పెరుగుతోందనే అంశం స్పష్టం. కానీ నాలుగు రోజులు తిరగకముందే ఓ జిల్లా పంచాయితీ అధికారి ఏకంగా లక్షరూపాయలు లంచం తీసుకుంటూ దొరకటం వ్యవస్థీకృతమైన అవినీతిని కళ్లకు కడుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: