రైస్ పుల్లింగ్ ముఠాల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఓ చోట ఈ ముఠాలు మకాం వేసి అందినకాడికి దోచుకుంటున్నాయి. ఈ తరహా మోసాలకు పాల్పడే రెండు ముఠాలను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 59 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.


లక్షకు లక్ష.... 10 లక్షలకు 10 లక్షలు...50 లక్షలకు  50 లక్షలు...ఎంత పెట్టుబడి పెడితే అంత రెట్టింపు వస్తుంది. అదే రైస్ పుల్లింగ్ మిషన్. ఇది ఉంటే చాలు మీ డబ్బులు డబుల్ అవుతుందంటూ అమాయకులను సులువుగా బుట్టలో వేసుకుంటారు. అందినకాడికి దండుకుని.. ఆ తర్వాత పరారవుతారు.  


తిరుపతి వేదికగా ఓ రెండు ముఠాలు.. ఇద్దరు  వ్యక్తులను ఇదే తరహాలో దగా చేశాయి. రైస్‌ పుల్లింగ్‌ పేరుతో వారి  వద్ద నుంచి ఏకంగా 59 లక్షల రూపాయలు నొక్కేశారు. బాధితుల ఫిర్యాదుతో తిరుపతి అర్బన్‌ పోలీసులు చాకచాక్యంగా నిందితులను అరెస్టు చేసి సొమ్ము రికవరీ చేశారు. హైదరాబాద్‌ మియాపూర్‌కు చెందిన గుమ్మడి వెంకటరత్నం, అదే ప్రాంతానికి చెందిన పటేల్‌ ముఖేష్‌ అలియాస్‌ బీకే రావులు ఓ బృందంగా ఏర్పడ్డారు. రైస్‌ పుల్లింగ్‌ పేరుతో మోసాలకు తెరతీశారు. హైదరాబాద్‌కు చెందిన రవికిషోర్‌ను ట్రాప్‌ చేశారు. తమకు తెలిసినవారి దగ్గర రైస్‌పుల్లర్‌ ఉందని తక్కువ ధరకే లభిస్తుందని చెప్పారు. దానిని కొంటే రెట్టింపునకు విక్రయించవచ్చని చెప్పడంతో రవీంద్రారెడ్డి వారికి 19 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత ఈ ముఠా సభ్యులు కనిపించకుండా పోయారు. 


చితూర్తు జిల్లాలోని వాల్మీకిపురం మండలం కురపర్తికి చెందిన చలమకోటి సిద్దప్ప అలియాస్‌ గుర్రం రమేష్‌, బెంగళూరుకు చెందిన జయం సునీల్‌, చీరాలకు చెందిన పల్లపు ప్రసాద్ లు కలిసి ఇదే తరహాలో రైస్ పుల్లింగ్ మోసాలకు పాల్పడ్డారు. వీరు మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యాపారి రవీంద్రారెడ్డి నుంచి  రైస్ పుల్లింగ్ మిషన్ ఉందని 40 లక్షలను నొక్కేసి ముఖం చాటేశారు. దీంతో ఇద్దరు బాధితులు తిరుపతి అర్బన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  


బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. రెండు బృందాలుగా ఏర్పడి బెంగళూరు, హైదారాబాద్‌లలో దాడులు నిర్వహించి  ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. 59 లక్షలను రికవరీ చేశారు. రేడియో యాక్టివేటీ యంత్రాన్ని వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. రైస్‌ పుల్లింగ్‌ పేరుతో చాలామంది మోసాలకు పాల్పడుతున్నారని వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఎస్పీ గజారావు భూపాల్. రైస్‌ పుల్లింగ్‌ అనేది పెద్ద మోసమని, ఆశకుపోయి మోసగాళ్ల వలలో పడొద్దని పోలీసులు  విజ్ఞప్తి చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: