మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. బీజేపీ, శివసేన తమ పట్టు వీడకపోవటం, కాంగ్రెస్, ఎన్.సి.పి  శివసేనతో కలవటానికి వెనకడుగు వేయటంతో ఎలాంటి స్పష్టతా రాలేదు. అయితే తమ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందంటూ శివసేన అందర్నీ హోటల్ కు తరలించింది. 


మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. అసెంబ్లీ గడువు 9వ తేదీతో ముగియనుండటంతో పార్టీలు చకచకా పావులు కదుపుతున్నాయి. ఓ వైపు గవర్నర్‌ను కలిసేందుకు బీజేపీ సిద్ధమవుతున్న వేళ.. తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా శివసేన జాగ్రత్త పడుతోంది. వారిని ముంబయిలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు తరలించేందుకు గదులు సిద్ధం చేసినట్టు సమాచారం. అలాంటిదేమీ లేదని శివసేన తోసిపుచ్చుతోంది.


అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారంటూ వార్తలొచ్చాయి. కానీ  తాను మహారాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోనని ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఆర్.ఎస్.ఎస్ జోక్యం చేసుకుంటుందన్న వార్తలను కూడా  కొట్టిపడేశారు. అయితే ముఖ్యమంత్రి పదవిని తమకు వదిలి వేస్తే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్-ఎన్.సి.పి కూటమికి మద్దతు ఇస్తామంటూ శివసేన మొదటి నుంచీ చెబుతూ వస్తోంది. కానీ శివసేనను తమ కూటమిలో చేర్చుకోవడం వల్ల లౌకికవాద పార్టీ అనే ముద్ర ఎక్కడ చెరిగిపోతుందోనని భయపడుతున్నాయి కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు. ఈ ఉద్దేశంతోనే ప్రతిపక్షంలోనే కూర్చుంటామని ఒకటికి పదిసార్లు తేల్చేస్తున్నారు. అయినా  శివసేన మాత్రం తమ ప్రయత్నాలు మానుకోలేదు. అయితే శుక్రవారం లోపు మహారాష్ట్రలో ఏదో ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి. ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి మ్యాజిక్ ఫిగర్ ఎమ్మెల్యేల మద్దతుతో ఏ పార్టీ నాయకులు ముందుకు రాకపోతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. ఆరు నెలల లోపు ఏ పార్టీ సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేకపోతే మహారాష్ట్రలో మళ్లీ శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా శివసేన 56 స్థానాల్లో విజయం సాధించాయి. 


మరోవైపు శివసేన మాత్రం ముఖ్యమంత్రి పదవిపై పట్టువీడటం లేదు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఏకంగా హోటల్‌ కు  తరలించింది. తమ ఎమ్మెల్యేలెవరూ కట్టుదాటకుండా జగ్రత్త పడుతోంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీకి సమీపంలోని హోటల్‌ కు ఎమ్మెల్యేలను తరలించారు. మహారాష్ట్రలో అసెంబ్లీ గడువు ముగియడానికి సరిగ్గా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో శివసేన ఈ నిర్ణయం తీసుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: