తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఎప్పుడు హాట్ టాపిక్కే. తెలుగుదేశం పార్టీలో తిరుగులేని రాజకీయ నేతగా ఎదిగిన రేవంత్....ఇప్పుడు కాంగ్రెస్ లో కీలక నేతగా మారిపోయారు. కాకపోతే టీడీపీలో మాదిరిగా కాంగ్రెస్ రాజకీయాలు ఉండవు. ఇక్కడ అంతర్గత రాజకీయాలు ఎక్కువ. అందుకే కాంగ్రెస్ లో రేవంత్ భవితవ్యం ఎంటనేది ఇంకా తేలడం లేదు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ కు కాంగ్రెస్ లో ఏ సీనియర్ నేతకు లేని విధంగా తెలంగాణలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు అదే ఫాలోయింగ్ వల్ల రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి వస్తుందని ప్రచారం జరుగుతుంది.


కానీ కొందరు సీనియర్లు దీనికి అడ్డుకట్ట వేస్తూనే ఉన్నారు. పీసీసీ పదవి రేవంత్ కు ఇవ్వకుండా చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  అయితే అధిష్టానం మాత్రం రేవంత్ పట్ల పాజిటివ్ గానే ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తమకే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని కొందరు సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా వి హనుమంతరావు లాంటి వారైతే బహిరంగంగానే రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.


ఇస్తే తనకు పీసీసీ పగ్గాలు ఇవ్వాలని లేదంటే వేరే వాళ్ళకు ఇవ్వాలని, అంతే గానీ రేవంత్ కు ఇస్తే మాత్రం ఊరుకునేది లేదని అధిష్టానానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఒకవేళ కాదని ఇస్తే పార్టీలో క్షణం కూడా ఉండనని అంటున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సమక్షంలోనే వి‌హెచ్ ఈ పంచాయితీ పెట్టారు. ఈ నేపథ్యంలోనే గులాం నబీ ఆజాద్ ఈ విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వానికి ఎలాంటి నివేదిక ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.


ఆ తర్వాతే రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ పదవి దక్కుతుందా లేదా అనే విషయం తేలిపోతుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ కాంగ్రెస్‌లో టీ పీసీసీ చీఫ్ పదవి దక్కకపోతే రేవంత్ రెడ్డి పార్టీలో ఉండటం అనుమానమే అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికైతే పీసీసీ పదవిపైనే రేవంత్ భవిష్యత్ ఆధారపడి ఉంది. చూడాలి మరి కాంగ్రెస్ నుంచి రేవంత్ రూటు ఎటు మారుతుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: