త‌హ‌శీల్దార్ విజ‌యారెడ్డి స‌జీవ ద‌హ‌నంతో తెలంగాణ రెవెన్యూ జేఏసీ పిలుపు మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు  క‌లెక్ట‌రేట్ల ముందు రిలే నిర‌హార దీక్ష‌లు చేస్తున్నారు. గురువారం మేడ్చ‌ల్‌, సంగారెడ్డి జిల్లాల‌లో  క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాల వ‌ద్ద‌ జ‌రుగుతున్న దీక్షా శిబిరాల‌ను తెలంగాణ రెవెన్యూ జేఏసీ నాయ‌కులు సంద‌ర్శించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ``చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా రెవెన్యూ శాఖ‌ను, ఉద్యోగుల‌ను అన్ని ర‌కాలుగా బ‌ద‌నాం చేస్తున్నారు. శాఖ ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి ఇలాంటి ఇబ్బందిని చూడ‌లేదు. భూ ప‌రిపాల‌న మాకొద్దు. లోప‌భూయిష్ట‌మైన చ‌ట్టాలు, సాప్ట్‌వేర్‌తో బ‌ద‌నాం అవుతున్నాం.``అని ప్ర‌క‌టించారు. 


ప్ర‌భుత్వాలు ఏవి ఉన్నా, పాల‌కులు ఎవ‌రున్నా రెవెన్యూ శాఖ‌నే పెద్ద‌న్న పాత్ర పోషించేదని తెలంగాణ రెవెన్యూ జేఏసీ నేత‌లు పేర్కొన్నారు. ``క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భుత్వం అంటే రెవెన్యూ అధికారులు, రెవెన్యూ శాఖ‌నే ఉండేది. నేడు ఆ ప‌రిస్థితి లేకుండా పోయింది. ప్ర‌భుత్వ ఖ‌జానాకు కావాల్సిన ఆదాయాన్ని భూ శిస్తు రూపంలో అందించేది. ప్ర‌తి ఏడాది ప్ర‌త్య‌క్షంగా రైతుల‌తోనే జ‌మాబంధిని నిర్వ‌హిస్తూ వారి నుంచి శిస్తు వ‌సూలు చేసేది. ఏ రైతుకు ఎంత భూమి ఉందో చెప్పేది. రైతుల‌కు, రెవెన్యూ ఉద్యోగుల‌కు విడ‌దీయ‌రాని అనుబంధం ఉండేది. కానీ నేడు కొంద‌రు రైతుల‌కు రెవెన్యూ అధికారులను శ‌త్రువులుగా స‌మాజం మార్చేసింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం లోప‌భూయిష్ట‌మైన రెవెన్యూ చ‌ట్టాలు, సాప్ట్‌వేర్లు. మండ‌ల స్థాయిలో ఉన్న అధికారుల‌కు రెవెన్యూ రికార్డుల‌ను స‌రిచేసే అధికారం లేదు. కొన్నింటిని స‌రి చేసేందుకు అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ఆన్‌లైన్‌లో  ఆ అవ‌కాశం లేదు.  దీంతో క్షేత్ర‌స్థాయిలో భూ స‌మ‌స్య‌లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రైతులు వద్ద బదనాం అవుతున్నాం. అందుకే భూ పరిపాలనా నుంచి రెవెన్యూ శాఖను మినహాయించాలని కోరుతున్నాం.`` అని స్ప‌ష్టం చేశారు. 


ఈ సంద‌ర్భంగా ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ సైతం ప్ర‌క‌టించారు.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని క‌లెక్ట‌రేట్ల ముందు రిలే నిర‌హార దీక్ష‌లు యధాతథంగా కొన‌సాగుతాయని, సోమ‌వారం రౌండ్ టేబుల్ స‌మావేశం ఉంటుంద‌ని తెలిపింది. ``త‌హ‌శీల్దార్ విజ‌యారెడ్డి స‌జీవ ద‌హ‌నం రెవెన్యూ ఉద్యోగులను భయభ్రాంతులను చేసింది. వారిలో ఆత్మస్థైర్యంను నింపేందుకు భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు అవ‌కాశం లేకుండా చేసేందుకు  తెలంగాణ‌ రెవెన్యూ జేఏసీ  ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం హైద‌రాబాద్‌లో రౌండ్ టేబుల్ స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్నాం. ఉద్యోగ‌, ఉపాధ్యాయ, కార్మిక‌, ఫెన్ష‌న‌ర్ల సంఘాలు, అన్ని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయ‌కులు పాల్గొంటారు.  ఈ స‌మావేశంలో అన్ని సంఘాల మ‌ద్ద‌తుతో భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ రూపొందించ‌డం జ‌ర‌గుతుంది.`` అని స్ప‌ష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: