మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సీఎం వైఎస్ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడం ద్వారా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తనను వైసీపీలోకి పార్టీలోకి ఆహ్వానించినా వెళ్లకపోవడం వలనే.. కక్షగట్టి దివాకర్ ట్రావెల్స్ బస్సులు సీజ్ చేస్తున్నారని. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడు చూస్తున్న పరిపాలన తాను ముందెప్పుడూ చూడలేదని... తన లాంటి వారిని టార్గెట్ చేస్తూ కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.


ఇటీవల ఓ పెద్ద మనిషి తనను కలసి.. అన్నా.. ఇంకా ఎందుకు టీడీపీలో ఉంటావు.. నీకు అనేక వ్యాపారాలున్నాయి. ఎందుకు ఇబ్బంది పడతావు.. నేను నీ గురించి మాట్లాడాను.. మీరు ఓకే అంటే వైసీపీలోకి తెచ్చేస్తానని సీఎంతో మాట్లాడాను.. ఆయన అవసరం ఉంటే ఆయన అడుగుతాడు కదా అన్నాడు.. అని జేసీ అన్నారు.


తాను మాత్రం ఏ పార్టీపడితే ఆ పార్టీలోకి రానని ఖరాఖండీగా చెప్పానని జేసీ అంటున్నారు. అలా వైసీపీలోకి రానందువల్లే తన బస్సులను సీజ్ చేస్తున్నారని అన్నారు జేసీ. దివాకర్ ట్రావెల్స్ బస్సులు వదలమని న్యాయస్థానం చెప్పినా.. అధికారులు వదలడం లేదని.. అలాంటి అధికారులపై తాను కేసులు వేయబోతున్నట్లు జేసీ చెప్పారు. అందుకు సంబంధించిన ప్రతులను అనంతపురంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రదర్శించారు. తనకు బస్సులు సీజ్ వలన చాలా నష్టం జరిగిందని.. అందుకే అధికారులపై కేసులు పెడుతున్నట్లు చెప్పారు.


ఉన్నతాధికారులను గతంలో ఏముఖ్యమంత్రి అన్నా అని సంబోధించలేదని.. ఇప్పుడు జగన్ అన్నా అని ఓవైపు పిలుస్తూనే.. మాట వినకపోతే బదిలీలు చేస్తున్నారని జేసీ విమర్శించారు. ప్రభుత్వ చీఫ్ సెకరెట్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం అంతటి వాడినే ఓ తన్ను తంతే వెళ్లి బాపట్లలో పడ్డారని..ఇక తాను తన వ్యాపారాలు ఏపాటి అంటున్నారు జేసీ.

ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఆర్డీఓ స్థాయి అధికారి స్థానంలో పంపారన్నారు. చింతమనేని లాంటి వారిపై వరుస కేసులు పెడుతూ రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని జేసీ మండిపడ్డారు. ఇలాంటివి ఎన్ని కేసులు వచ్చినా తాను భయపడేదిలేదని అంటున్నాడు జేసీ.


మరింత సమాచారం తెలుసుకోండి: