ఏపీలో మద్యనియంత్రణపై సీఎం జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. ఇప్పటికే మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వపరం చేసిన ఆయన ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బార్ల సంఖ్యను తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. అంతే కాదు.. వీటిని తెరచి ఉంచే సమయాలను కుదించేశారు.


ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఇకపై బార్లను అనుమతిస్తారు. ఈ మేరకు అబ్కారీ శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని బార్లకు అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు వహించాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదాయ ఆర్జన శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.


రెవెన్యూ , రవాణా, అబ్కారీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ , అటవీ, మైనింగ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంపై సీఎం సమీక్షించారు.శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. ఇక్కడ ఓ కీలకమైన విషయాన్ని గమనించాలి. జగన్ ప్రభుత్వం విరివిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్న లక్ష్యంతో జగన్ ఉన్నారు. మరి ఆర్థిక వ్యవస్థ అందుకు సహకరించేదిగా కనిపించడం లేదు. కానీ జగన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేనేలేదు. దీనికితోడు ఈ సంక్షేమ పథకాలు నడిచేందుకు ఆదాయం తెచ్చి పెట్టే మార్గాలను కూడా జగన్ తగ్గిస్తున్నారు. మద్య నియంత్రణ కోసం కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు.


మరి ఇలా చేస్తే రేపు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో నిధుల కొరత ఏర్పడటం తప్పనిసరి. కానీ జగన్ మాత్రం నిధుల కంటే తనకు ప్రజారోగ్యమే ముఖ్యం అంటున్నారు. మరి ఈ రెండింటినీ అంతగా అనుభవం లేని ముఖ్యమంత్రి జగన్ ఏమేరకు సమన్వయం చేసుకుంటారో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: