అబ్దుల్లాపూర్ మెట్‌లో తహశీల్దార్ పై సురేశ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి తగులబెట్టిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యంకలిగిస్తున్నాయి. ఇప్పుడు కొందరు తాము కూడా సురేశ్ లా చేయాలా అంటూ రెవెన్యూ అధికారులను బెదిరిస్తున్నారు. సోషల్ మీడియాలో విజయారెడ్డి హత్యోదంతం బాగా వైరల్ కావడంతో జనం కూడా బెదిరించే స్థాయికి వెళ్తున్నారు.


తాజాగా కామారెడ్డికి చెందిన ఆర్డీఓకు ఇలాంటి ఓ బెదిరింపు కాల్ వచ్చిందట. పాస్ బుక్ ఇస్తావా ? లేకపోతే తహశీల్దార్ విజయారెడ్డి తరహాలోనే నిన్ను కూడా చంపేయమంటావా అని ఓ వ్యక్తి ఫోన్ చేశాడట. భూ వివాదంలో న్యాయం చేయలేదని ఓ కానిస్టేబుల్ ఫోన్ చేసి ఆర్డీవో రాజేంద్రకుమార్‌ను బెదిరించాడట.


బెదిరింపు కాల్ తో అప్రమత్తమైన ఆర్డీఓ.. జిల్లా ఎస్పీకి ఈ విషయంపై ఫిర్యాదు చేశారట. రంగంలోకి దిగి కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు ఫోన్‌ చేసిన వ్యక్తి జిల్లాలోని తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డిగా గుర్తించారు. కామారెడ్డిలో ఎఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఈ పని చేశాడని పోలీసులు అంచనాకు వచ్చారు.


విజయారెడ్డి హత్య తర్వాత ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఓ రైతు ఏకంగా రెవెన్యూ అధికారులపై పెట్రోల్ జల్లారు. ములుగు జిల్లాలో ఓ మహిళ.. బడితె కర్ర పట్టుకుని ఎమ్మార్వో కార్యాలయం ముందు వీరంగం వేసింది. మరో ఘటనలో ధర్నా చేస్తున్నా రెవెన్యూ ఉద్యోగులను తాము ఇచ్చిన లంచం తిరిగి ఇవ్వాలని ఓ వృద్ధజంట నిలదీసింది.


సోషల్ మీడియాలోనూ విజయారెడ్డి హత్య తర్వాత రెవెన్యూ అధికారుల లంచం అనే విషయం బాగా వైరల్ అవుతోంది. మరికొందరు మూర్ఖ శిఖామణులైతే.. ఏకంగా విజయారెడ్డిని చంపిన సురేశ్ ను భగత్ సింగ్ తో పోలుస్తూ వీడియోలు పెడుతున్నారు. సురేశ్ ఫోటోలకు కొన్ని సినిమా క్లిప్పింగులు జోడించి లఘు చిత్రాలు రూపొందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: