తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె వల్ల ఏపీ ఆర్టీసీలో కొత్త అనుమానాలు మొదలైయ్యాయి. అంతే కాకుండా కేసీయార్ కూడా మరీ మరీ చెప్పాడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అంత సులువైన పనికాదని. ఈ దశలో  తెలంగాణ హైకోర్టులో ఆర్టీసీ విభజన జరగలేదన్న కేంద్రం వాదనతో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు ఇబ్బంది అవుతుందా? అనే చర్చ ఏపీ సర్కారులో కొనసాగుతోంది. విభజన కాకుండా ఏపీలో విలీనం చెల్లుబాటు అవుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..


ఇకపోతే ఏపీ సర్కార్ ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో జరుగుతోన్న వాదనలు, పరిణామాలను పరిశీలిస్తోంది. అసలేం జరిగిందంటే తెలంగాణ హైకోర్టుకు సొలిసిటర్ జనరల్ రాష్ట్ర విభజన జరిగినా ఆర్టీసీ విభజన జరగలేదని తెలపడం కొత్త చర్చకు దారి తీసింది. అంతే కాకుండా ఏపీఎస్ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉందని ఆయన తెలిపారు. ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని, టీఎస్ఆర్టీసీకి ఆటోమేటిక్‌గా బదిలీ కాదని కేంద్ర ప్రభుత్వం వాదన వినిపించింది.


అయితే ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వానికి కేంద్రం వాదనతో ఇబ్బందులు రావొచ్చనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ మంత్రి పేర్ని నాని ఏపీలో ఆర్టీసీ విలీనానికి ఎలాంటి ఇబ్బంది లేదని, ఏపీలో కార్మికుల విలీనానికి ఆర్టీసీ బోర్డు అంగీకరించిందని మంత్రి చెప్పారు. అంతే కాకుండా విభజన జరగలేదన్న కేంద్రం…ఏపీ, తెలంగాణకు విడివిడిగా ఎలక్ట్రిక్ బస్సులు నిధులు ఎలా కేటాయించిందని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.


ఇదంతా ఒకెత్తు ఐతే ఆర్టీసీ విభజన జరగకుండా ఏపీలో విలీనం ఎలా చేస్తారంటూ ఎవరైనా కోర్టుకు వెళితే మాత్రం ఏపీ ప్రభుత్వానికి సమస్యలు తప్పవు. అప్పుడు ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే, ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను విలీనం చేయడం లేదని, కేవలం ఉద్యోగులను మాత్రమే విలీనం చేస్తున్నారు కాబట్టి, పెద్ద వివాదం ఉండకచపోవచ్చని ఆర్టీసీ, అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయినా సరే దీనిపై ఓ సారి న్యాయనిపుణుల సలహా తీసుకోవాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: