సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌కు ఆర్టీసీ స‌మ్మె చుక్క‌లు చూపిస్తోంది. ఓ వైపు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌...మ‌రోవైపు కార్మికులు మొండిప‌ట్టు వీడ‌క‌పోవ‌డంతో...స‌మ్మె కొలిక్కి రావ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో కోర్టు విచార‌ణ‌లో....ఐఏఎస్‌ల‌కు ఊహించ‌ని చిక్కులు ఎదుర‌వుతున్నాయి.  ఆర్టీసీ సమ్మెను విరమింపజేసి ప్రజలకు రవాణాసౌకర్యాలు మెరుగయ్యేలా చూడాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం గురువారం మరోమారు విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ స్వయంగా విచారణకు హాజరయ్యారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. విచారణకు హాజరైన సీనియర్ ఐఏఎస్‌లు మూడున్నర గంటలపాటు హైకోర్టుకు వివరణ ఇస్తూ నిలబడి ఉన్నారు.


మ‌రోవైపు విచార‌ణ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ ఇచ్చిన అఫిడవిట్లతో మీరు సంతృప్తి చెందారా? అని సీఎస్ జోషిని ధర్మాసనం ప్రశ్నించింది. తాను సంతృప్తి చెందానని, గతంలో కొన్ని లోటుపాట్లను సరిచేసుకుని ప్రస్తుతం కచ్చితమైన వివరాలతో అఫిడవిట్లు సమర్పించారని సీఎస్ ధర్మాసనానికి నివేదించారు. ``మొదట ప్రమాణం చేసి ఇచ్చిన అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చామని ఒప్పుకొంటున్నారా? మొదట ఇచ్చింది తప్పయితే ఈ అఫిడవిట్లను మేం ఎలా నమ్మాలి? రికార్డుల సూక్ష్మ పరిశీలన అని ఒకసారి, మైక్రోస్కోపిక్ పరిశీలన అని ఇంకోసారి చెప్తారా? అఫిడవిట్ అంటే ఏమిటో తెలుసా? హైకోర్టుకు తప్పుడు లెక్కలు ఎలా ఇస్తారు? ప్రమాణం చేసి తప్పుడు ప్రకటన చేయడం, కోర్టును తప్పుదోవ పట్టించడం నేరం. దీనిని మేం ధిక్కరణ కింద పరిగణిస్తే ఏమవుతుంది? సీనియర్ ఐఏఎస్‌లు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇలా అబద్ధాలు చెప్తారని మేం ఊహించలేదు`` అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

దీంతో...ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు వాదనలు వినిపిస్తూ.. అఫిడవిట్ సమర్పించడానికి చాలా తక్కువ సమయం ఉండటంతో అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న వివరాలను ఇచ్చానని పేర్కొన్నారు. గత అఫిడవిట్‌లో రూ.500 కోట్లు తక్కువగా చెప్పామని, మొత్తం ఇచ్చింది రూ.3,903 కోట్లు అని తెలిపారు. లెక్క తక్కువగా చెప్పినందుకు క్షమాపణ కోరుతున్నానన్నారు. క్షమాపణలతో సమస్య పరిష్కారంకాదన్న కోర్టు.. అధికారులు తమ వైఖరిని పలుమార్లు మార్చుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తంచేసింది. అంతర్గత రికార్డుల్లో కచ్చితమైన లెక్కలు ఎందుకులేవని, అఫిడవిట్లు ఇచ్చే ముందే పే అండ్ అకౌంట్స్ వివరాలను ఎందుకు తెప్పించుకోలేదని ప్రశ్నించింది. ఓ దశలో ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్‌శర్మపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ``మీ బాస్‌ను తప్పుదోవ పట్టించినట్టు మీరే అంగీకరిస్తున్నారు. హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించరని గ్యారెంటీ ఏమిటి? అసలు మిమ్మల్ని ఎలా నమ్మాలి? మీరు రవాణాశాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని, ప్రజలను తప్పుదోవపట్టించారు. న్యాయమూర్తిగా మూడు హైకోర్టుల్లో పనిచేశాను. నా 15 ఏండ్ల సర్వీస్‌లో ఇలాంటి అధికారులను చూడలేదు. మీ లెక్కలన్నీ అర్థరహితం`` అని చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: