ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ కవిత వైరల్ అవుతోంది. అది మీ కోసం..


దొరా....! ఆగని గడియారపు ముల్లోలే ....ఘడియకో గుండె ఆగుతోంది, పూటకో శవం లేస్తోంది.ఇంకెన్ని గుండెలు ఆగాలి దొరా...!

నీకు ఇంకెన్ని శవాలు కావాలి మా దొరా...!

నీ ఖాకీల లాఠీలు, వారి తూటాలు, ఈ పోరుతెలంగాణా బిడ్డలకు కొత్తేమీ కాదు దొరా...!

మా గోసను నీయాసతో, నీ భాషతో గేలి చేస్తున్నావు,

ఆపదలో ఉన్నప్పుడు అన్యాయం జర్గినప్పుడు...

వాళ్ళ కళంతో, వాళ్ళ గళంతో, వాళ్ల కాలి గజ్జలతో పొద్దును సైతం పొడిపించిన..

నా తెలంగాణ కలాలు, గళాలు, గజ్జెలు ఎమాయే ఎటుపాయే?

ఏ ఒక్కడి కలంనుండి, ఏ ఒక్కడి గళం నుండి...

ఆగుతున్న ఆర్టీసీ గుండెల గురించి ఏ ఒక్క అక్షరం బయటకు రాదే?

ఏ ఒక్క గళం స్వరాన్ని సరిచేయదే...?

ఆ కలాలు ఎటుపాయే...?

ఆ గళాలు ఏమాయే.....?

సమస్త కార్మిక - కర్షక , ఉద్యోగ - ఉపాధ్యాయ, విద్యార్థి,


యువజన, సమస్త రాజకీయ పక్షాలు మాకు వెన్నుదన్నుగా ఉన్నాయి

దొరా....!దొరా....!

బంగారు తెలంగాణా అన్నావు, బ్రతుకు లేకుండా చేసావు,

మిగులు రాష్ట్రం అన్నావు, మింగమెతుకు లేకుండా చేసావు,

పండుగల పూట మా పిల్లాపాపలను పస్తులే ఉంచావు....!

60 మంది ప్రయాణికులు ఆగమైపోయినా ఉలకవు,

20 మంది బాలలు సమిదలైపోయినా పలకవు,

పసిప్రాణాలు గాలిలో కలిసినా చలించవు.....

నువ్వేమి దొరవి ? నువ్వెక్కడి దొరవి..?

నిన్ను నమ్మాo దొరా...! మోసం చేశావ్ దొరా....!

మేము మోసపోయాం దొరా....!

ఇది ఆర్టీసీ పోరాటం కాదు, ఇది ఆకలి పోరాటం అంతకన్నా కాదు,

తెలంగాణలో తొలిఉద్యమం అయ్యింది ...తెలంగాణలో మలి ఉద్యమం ముగిసింది....కానీ, దొరా...!

కార్మికుల కళ్ళు ఎర్రబడుతున్నాయి గుండెలు మండుతున్నాయి.

అందులోనుంచి వచ్చేవి కన్నీరనుకుంటే పొరబాటే ..

గుర్తుంచుకో దొరా...! మండుతున్న కార్మికుని గుండె అగ్నిపర్వతం లాంటిది...!

ఆర్టీసీ కార్మికులారా..!, చెల్లెలారా..!

దయచేసి మీరేవరూ ఆత్మహత్యలు చేసుకొని తనువు చాలించవద్దు.

మనం పిరికివారము కాము,

అవసరం అయితే యుద్ధంలో బరిగీసి పోరాడి ప్రాణాలు పోగొట్టుకుందాం!

ఇలాకాదు... తెగించి పోరాడుదాం....!


మరింత సమాచారం తెలుసుకోండి: