బాబ్రీ మసీదు విషయంలో అయోధ్యలో హిందువులు, ముస్లింల మధ్య దశాబ్దాల నుండి వివాదం నడుస్తోంది. హిందువుల గుంపు 1992 సంవత్సరంలో మసీదును కూలగొట్టడంతో అల్లర్లు జరిగాయి. హిందూ దేవాలయాన్ని కూలగొట్టి ముస్లిం రాజులు బాబ్రీ మసీదు కట్టారని హిందువులు మసీదును కూలగొట్టారు. దాదాపు 2,000 మంది ఈ అల్లర్లలో చనిపోయారు. ఆ తరువాత అయోధ్యలోని భూమి మీద యాజమాన్యానికి సంబంధించి అలహాబాధ్ హైకోర్టులో కేసు నమోదు కాగా 2010లో కోర్టు ప్రకటించిన తీర్పును 2011లో సుప్రీంకోర్టు ధర్మాసనం సస్పెండ్ చేసింది. 
 
సుప్ర్రీంకోర్టు సుధీర్ఘ విచారణ తరువాత ఈ కేసుకు సంబంధించిన తీర్పును ఇవ్వనుంది. హిందూ ముస్లిం మనోభావాలకు సంబంధించిన కేసు కావటంతో ఈ కేసులో తీర్పు కోర్టుకు కూడా భారంగా మారింది. నవంబర్ నెల 17వ తేదీలోపు కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉందని సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో అలర్ట్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశంలోని సున్నిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాల్ని మోహరిస్తోంది. 
 
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, వివాదాస్పద కామెంట్లు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటన చేసింది. కేంద్రం రాష్ట్రాలకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల పారామిలిటరీ దళాలను అయోధ్యకు ఇప్పటికే తరలించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేంద్ర పాలిత ప్రాంతాలకు, రాష్ట్రాలకు ఇప్పటికే సూచనలు చేసింది. 
 
ప్రధాని మోదీ మంత్రులకు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. ప్రజలు అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవించాలని మోదీ సూచించారు. సుప్రీంకోర్టులో గత నెలలోనే ఈ కేసుకు సంబంధించిన వాదనలు ముగిశాయి. సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ముస్లిం సంస్థ జమియత్ - ఉలేమా - ఇ - హింద్ సుప్రీం తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాలని విజ్ఞప్తి చేసింది. జమియత్ ప్రెసిడెంట్ మౌలానా అర్షద్ మదీనా తీర్పు ఏదైనా సుప్రీం జడ్జిమెంట్ ను ముస్లింలు, మిగతావారు ఒప్పుకోవాలని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: