సొంత జిల్లా చిత్తూరులోనే చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ తగిలేట్లే ఉంది. సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఏ డికె సత్యప్రభ తొంరలోనే తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. చిత్తూరులోని తన ఇంట్లోనే ఆమె గురువారం వైసిపి ఎంఎల్ఏలతో రహస్యంగా భేటి అయిన విషయం బయటకు పొక్కటంతో పార్టీలో సంచలనంగా మారింది.

 

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో డికె కుటుంబమంటే కొత్తగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దివంగత నేత, మాజీ ఎంపి డికె ఆదికేశవుల నాయుడు భార్యే సత్యప్రభ. 2014లో చిత్తూరు ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు. మొన్నటి ఎన్నికల్లో రాజంపేట ఎంపిగా పోటి చేసి ఓడిపోయారు. ఎంపిగా పోటి చేయటం తనకు ఇష్టం లేదని ఆమె ఎంత చెప్పినా చంద్రబాబునాయుడు వినిపించుకోలేదు.

 

పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు పోటి చేసినా గెలపు కష్టమని ఆమె చెప్పినా వినిపించుకోకుండా ఒత్తిడిపెట్టి పోటి చేయించారు. అందరూ అనుకున్నట్లుగానే టిడిపి ఓడిపోయింది.  దాంతో పాటు పార్టీ కూడా ఘోరంగా ఓడిపోవటంతో ఆమె చంద్రబాబుపై మండిపోతున్నారు. దాంతో ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇపుడు చంద్రబాబు చంద్రగిరిలోనే మూడు రోజులుగా మకాం వేసి నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నా ఆమె మాత్రం అడ్రస్ లేరు.

 

ఒకవైపు చంద్రబాబు జిల్లాలో ఉండగానే చిత్తూరులోని ఆమె ఇంట్లో వైసిపి ఎంఎల్ఏలు ఆరణి శ్రీనివాసులు, ద్వారకనాధరెడ్డి, వెంకటేష్ గౌడ్, ఎంఎస్ బాబులు సమావేశమవ్వటం సంచలనంగా మారింది. శ్రీపురం స్వర్ణదేవాలయం పీఠాధిపతి శ్రీనారాయణి అమ్మన్ సత్యప్రభ ఇంట్లో పూజలు నిర్వహించారు.

 

ఆ సందర్భంగా ఆమె ఇంటికి వచ్చిన ఎంఎల్ఏలు తర్వాత మాజీ ఎంఎల్ఏతో చాలాసేపు విడిగా సమావేశమైన విషయం బయటకు పొక్కింది. నిజానికి డికె కుటుంబానికి రాజకీయంగా పెద్దగా పలుకుబడి లేకపోయినా ఆర్ధికంగా మాత్రం అత్యంత పటిష్టంగా ఉంది. బెంగుళూరు కేంద్రంగా వేల కోట్ల రూపాయలు టర్నోవర్ ఉన్న వ్యాపారాలు, విద్యాసంస్ధలు, రవాణా రంగంలో పెట్టుబడులు చాలా ఉన్నాయి. కాబట్టి డికె కుటుంబం గనుక టిడిపికి రాజీనామా చేస్తే చంద్రబాబుకు పెద్ద షాక్ అనే చెప్పాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: