అవినీతి నిరోధక శాఖ వలకు కర్నూలు జిల్లా గూడూరు మున్సిపాలిటీ తహశీల్దార్ హసీనా బీ చిక్కారు. సురేశ్ అనే రైతు ఆన్ లైన్ లో తన భూమి వివాదాన్ని పరిష్కరించాలని తహశీల్దార్ హసీనా బీని కోరాడు. భూ వివాదాన్ని పరిష్కరించాలంటే తనకు 8 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని హసీనా బీ రైతును డిమాండ్ చేసింది. రైతు అంత డబ్బును లంచంగా ఇవ్వలేనని చెప్పగా హసీనా బీ 4 లక్షల రూపాయలు ఇస్తే సమస్య పరిష్కరిస్తానని చెప్పింది. 
 
తహశీల్దార్ 4 లక్షల రూపాయలను కర్నూలు జిల్లా పాణ్యం బస్టాండు దగ్గర తన సోదరుడైన మహబూబ్ భాషా అనే వ్యక్తికి ఇవ్వాలని రైతుకు సూచించింది. రైతు అంతకు ముందే కర్నూలు జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించాడు. పాణ్యం బస్టాండులో రైతు నుండి మహబూబ్ భాషా 4 లక్షల రూపాయలు తీసుకొనే సమయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మహబూబ్ భాషను పట్టుకున్నారు. 
 
అవినీతి నిరోధక శాఖ అధికారులు మహబూబ్ భాషా ను విచారించగా తహశీల్దార్ హసీనా బీ తనను పంపించినట్లు చెప్పాడు. 4 లక్షల రూపాయలను మహబూబ్ భాషా దగ్గర నుండి అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ భాషాను అరెస్ట్ చేసిన విషయం తహశీల్దార్ హసీనా బీకు తెలియటంతో హసీనా బీ తన మొబైల్ ను స్విఛాఫ్ చేసింది. 
 
ప్రస్తుతం హసీనా బీ పరారీలో ఉంది. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ నాగభూషణం హసీనా బీ పరారీలో ఉన్నట్లు తెలిపారు. గతంలో హసీనా బీ నంద్యాల డిప్యూటీ తహశీల్దార్ గా పని చేశారు. నెల రోజుల క్రితం నుండి రైతు సురేశ్ సమస్య పరిష్కరించమని కోరగా లంచం ఇస్తేనే సమస్య పరిష్కరిస్తానని తహశీల్దార్ చెప్పినట్లు తెలుస్తోంది. గూడూరు తహశీల్దారు కార్యాలయంలో నిన్న రాత్రి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: