తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి సీఎం కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు.  తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ అథారిటీ(టీటీఎ) ఆర్టీసీ 452 కోట్ల రూపాయలు పన్ను రూపంలో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. టీటీఎ కార్యదర్శి మమతా ప్రసాద్ ఆర్టీసీకి ఈ నోటీసులను జారీ చేశారు. వీలైనంత తక్కువ సమయంలో పన్ను బకాయిలు చెల్లించాలని మమతా ప్రసాద్ సూచించారు. 
 
తెలంగాణ ఆర్టీసీ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ నిధులను కూడా ఆర్టీసీ యాజమాన్యం వాడుకుందని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రిలోగా ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరాలని సూచించారు. కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రం సీఎం కేసీఆర్ ఆదేశాలను పట్టించుకోలేదు. కేవలం 300 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. విధుల్లో చేరిన తరువాత కొందరు తిరిగి సమ్మెలో పాల్గొనటం గమనార్హం. 
 
మరోవైపు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆర్టీసీ కార్మికుల సమ్మె కేసు విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు విచారణలో ఆర్థిక శాఖ సమర్పించిన నివేదికలు రెండూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయని అధికారులను తప్పుబట్టింది. అధికారులు చెబుతున్న వాదనలపై హైకోర్టు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు కార్మికులు, ఆర్టీసీ యాజమాన్యం మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తోందని ఆర్టీసీ, ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు రావటం లేదని పేర్కొంది. 
 
ఈ నెల 11వ తేదీలోగా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోతే తామే ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తామని హైకోర్టు పేర్కొంది. ఐఏఎస్ స్థాయి అధికారులు అసంపూర్ణంగా కోర్టుకు నివేదిక ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇంత దారుణంగా తప్పుడు వివరాలను ఇచ్చిన వారిని తన సర్వీసులోనే చూడలేదని సీజే జస్టీస్ చౌహాన్ వ్యాఖ్యలు చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: