దొంగతనం చేయాలనుకున్న వాడి చేతికి ఏ వస్తువు అడ్డుకాదు అన్నట్లుగా ఉంది ఇప్పుడున్న దొంగల తీరు. ఇకపోతే ఇప్పుడు ఎక్కువగా దొంగతనాలు ముఠాలుగా ఏర్పడి చేస్తున్నారు కొందరు యువకులు. ఇప్పటికే ఇళ్లల్లో ఉన్న వస్తువులకు దొంగల భయం ఉండగా ఇప్పుడు రోడ్లపైన తిరిగే వాహానాల్లోని పార్ట్స్‌ను దొంగిలించే కేటుగాళ్లు తయారు అయ్యారు. ఇలాంటి దొంగల భరతం పట్టారు పోలీసులు. వివరాల్లోకి వెళ్లితే.


భోగాపురం మండలంలో జాతీయరహదారిపై రామచంద్రపేట గ్రామ సమీపాన ఆగి ఉన్న వాహనాల నుంచి దొంగలు దొంగిలించిన డీజిల్‌ ఆయిల్‌తో పాటు బ్యాటరీలు, జనరేటర్‌ వైర్లు పట్టుకున్నట్లు స్దానిక ఎస్‌ఐ మహేష్‌ గురువారం తెలిపారు. ఈ దొంగతనంలో నలుగురు వ్యక్తులు పాలుపంచుకున్నారు. అందులో ముగ్గురు నిందితులు దొరికినట్లు, ఒకరు పరారైనట్లు ఆయన చెప్పారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం...


రాత్రి వేళ భోగాపురం మండలంలో డీజిల్‌ దొంగతనాలు జరుగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఎక్కువగా జాతీయరహదారి పనులకు ఉపయోగించే వాహనాలను ఒక చోట రాత్రి వేళ ఉంచడంతో ఇదే అదునుగా భావించిన కొందరు నేరగాళ్లూ, చోరీలకు పాల్పడుతున్నారట. ఈ విషయాన్ని గమనించిన వాహనాల యజమానులు, సిబ్బందికి వాహనాలపైన నిఘా ఉంచాలని సూచించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి రామచంద్రపేట క్వారీ వద్ద ఉన్న వాహనాల నుంచి 310 లీటర్ల డీజిల్‌ ఆయిల్‌ను, జేసీబీలకు అమర్చిన పెద్దబ్యాటరీలు, జనరేటర్లకు ఉన్న వైర్ల చోరీ జరిగిన విషయాన్ని గమనించిన కొందరు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


ఇకపోతే వీటి విలువ రూ.40వేల వరకు ఉంటుందని, క్వారీ సూపర్‌వైజర్‌ సుబ్బరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక పోలీసు పెట్రోలింగ్‌లో భాగంగా భోగాపురం వద్ద రెక్కి నిర్వహిస్తున్న పోలీసులు ఆటోలో క్యాన్లతో తరలిస్తున్న డీజిల్‌ను, ఇతర చోరీ సొత్తును గుర్తించి పట్టుకున్నారు.


పట్టుకున్న నిందితుల్లో సిమ్మపేట, డెంకాడ, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన రాంబాబు, కార్తీక్‌, సోమేశ్‌లను అదుపులో తీసుకున్నామని, మరొకరు అనిల్‌ పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నామన్నారు. ఇదేకాకుండా గతంలో జరిగిన డీజిల్‌ దొంగతనాలకు ఈ ముఠాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మహేష్‌ చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: