మొన్నటి ఎన్నికల తర్వాత టీడీపీ అనేక కుదుపులకు గురవుతోంది. ఎన్నికల్లో 23 సీట్లే గెలుచుకోవటమేంటని తల పట్టుకుంటున్న అధినేతకు పార్టీ ఫిరాయింపులతో తల బొప్పికడుతున్నట్టే ఉంది. ‘టీడీపీ నుంచి బీజేపీలోకి త్వరలో మరింత చేరికలు ఉంటాయి’ అని ఇప్పటికే పలువురు బీజేపీ నాయకులు పలు వేదికలపై స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఇవి నిజమనిపిస్తూ.. అగ్ర టీడీపీ నాయకుడు గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడి బీజేపీలో చేరుతున్నారనే వార్త ఇప్పుడు మీడియాలో వస్తున్నాయి. ఇందుకోసం ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దల్ని కలిసి మంతనాలు జరిపారనే వార్తలు గుప్పుమంటున్నాయి.

 


గంటా శ్రీనివాసరావు మొదట టీడీపీ నుంచి చిరంజీవి ప్రజారాజ్యంలో చేరారు. అటుపై కొన్ని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ లో ఉన్నారు. 2014కి ముందు మళ్లీ టీడీపీలో చేరి భీమిలీ నుంచి గెలిచారు. అయిదేళ్ల పాటు మంత్రిగా పని చేశారు. 2019లో టీడీపీ తరపునే విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఫలితాల తర్వాత నుంచి టీడీపీ కార్యకలాపాల్లో గంటా పాల్గొన్నది తక్కువే. ఆయన పార్టీ మారిపోతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి.. పార్టీ మారటం లేదని గంటా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. కానీ మొన్నటి పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించినా ఆయన హాజరుకాకపోవటం చర్చనీయాంశమైంది. దీంతో పార్టీ మార్పు గురించి గంటాపై వస్తున్న వార్తలకు బలం చేకూరినట్టైంది.

 


తాజాగా వస్తున్న రూమర్లపై గంటా ఇప్పటివరకూ స్పందించింది లేదు. ప్రస్తుతం మీడియాలో గంటా టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. మరో వారం, పది రోజుల్లో గంటా బీజేపీలో చేరడానికి ముహూర్తం ఖరారైందని తాజా సమాచారం. ఈ వార్తలో నిజమెంతో మళ్లీ గంటానే సమాధానం చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: