ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువు చెప్పటంతో పాటు క్రమశిక్షణ నేర్పించాలి. కానీ ఆ ఉపాధ్యాయులే క్రమశిక్షణ తప్పుతూ విద్యార్థులను వేధిస్తున్నారు.కొందరు ఉపాధ్యాయులు చదువుకోవాలని పాఠశాలకు వచ్చిన విద్యార్థులతో అడ్డమైన పనులు చేయించుకోవాలని చూస్తున్నారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో ప్రవీణ కుమారి ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచర్ గా పని చేస్తున్నారు. బుధవారం రోజున ప్రవీణ కుమారి ఒక విద్యార్థినిని పిలిచి నా కాళ్లు ఒత్తు... రోజుకు 100 రూపాయలు ఇస్తా అని చెప్పింది. 
 
ఆ విద్యార్థిని అందుకు ఒప్పుకోలేదు. ఆ తరువాత ఆ విద్యార్థిని తోటి విద్యార్థినులతో పాఠశాలకు వచ్చింది చదువుకోవడానికని కాళ్లు పట్టుకోవడానికి కాదని చెప్పింది. ఈ విషయం విద్యార్థినులు ప్రవీణ కుమారికి చెప్పారు. విషయం తెలిసిన ప్రవీణ కుమారి విద్యార్థినిని తీవ్రంగా మందలించింది. టీచర్ ఏ తప్పు చేయకపోయినా మందలించటంతో విద్యార్థిని మనస్థాపానికి గురైంది. 
 
బుధవారం రాత్రి విద్యార్థిని తల్లిదండ్రులకు చేయని తప్పుకు టీచర్ మందలించిందని రోజుకు 100 రూపాయలు ఇస్తా... కాళ్లు ఒత్తు అని అడిగిందని చెప్పింది. నిన్న ఉదయం విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఆందోళన చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు చదువు చెప్పడం మానేసి టీచర్లు విద్యార్థినులతో ఇలాంటి పనులు చేయించుకుంటారా...? అని ప్రశ్నించారు. టీచర్ ప్రవీణ కుమారిని ఇంకోసారి ఇలా చేసినట్లు తెలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. 
 
ఈ విషయం నెల్లూరు జిల్లా సర్వశిక్షా అభియాన్ పీవోకు తెలియడంతో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విచారణకు వచ్చిన అధికారి విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థిని, ఉపాధ్యాయినితో విడివిడిగా చర్చలు జరిపి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెప్పారు. ఉపాధ్యాయినిని వేరే పాఠశాలకు బదిలీ చేస్తామని విచారణకు వచ్చిన అధికారి విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పారు. అప్పటివరకు పాఠశాల ముందు ఆందోళన చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు అధికారి మాట్లాడిన తరువాత ఆందోళనను విరమించారు. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: