మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాలేదు. శివసేన కొంత మెత్తబడ్డట్టు కనిపించినా.. మళ్లీ సీఎం పదవిపై వెనక్కితగ్గేది లేదని చెబుతోంది. అటు బీజేపీ నేతలు కూడా గవర్నర్ ను కలిశారు. మరోవైపు రాష్ట్రపతి పాలన పెట్టాలని బీజేపీ కుట్ర చేస్తోందని శివసేన ఆరోపించింది. 


ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం చేస్తూ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులను బీజేపీ తెస్తోందని శివసేన ఆరోపించింది. ప్రభుత్వ ఏర్పాటు చేసే స్థితిలో లేకుంటే ఆ విషయాన్ని స్పష్టం చేయాలనీ, అప్పుడు తాము తదుపరి చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి పదవిపై చెరిసగం ఒప్పందానికి శివసేన కట్టుబడి ఉందనీ, ఉద్ధవ్‌ పార్టీకి చెందిన వ్యక్తే సీఎం అవుతారని శివసైనికులు ధీమాగా ఉన్నారు. 


అటు శివసేన ఎమ్మెల్యేలను హోటల్ కు తరలించడంపై సంజయ్ రౌత్ మాట మార్చారు. అందరికీ ముంబైలో వసతి లేకపోవడంతో.. హోటల్ గదులు బుక్ చేశామని చెప్పారు. గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు ఉత్త చేతులతో ఎందుకు తిరిగొచ్చారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై న్యాయపరమైన అంశాలను చర్చించడానికే గవర్నర్ ను కలిశామని కాషాయ పార్టీ నేతలు చెబుతున్నారు. 


మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ సర్కారుతో పాటు ఆ పార్టీ ముఖ్యమంత్రి కూడా వద్దన్నారు. మహారాష్ట్రలో గత ఐదేళ్లపాటు పాలించిన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 16వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనీ, అందుకే  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానివ్వరని చెప్పారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటుపై ఆ పార్టీ నాయకుడు ఉద్ధవ్ థాక్రే నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదనీ, అవి వచ్చినపుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: